ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై అధికార పంక్షం నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అండ్ కో చేసిప ప్రతీ విమర్శపై ఎప్పటికప్పుడు కౌంటర్ పడిపోతుంది. తాజాగా ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి మరోసారి బాబు పై మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇస్తే దివంగత నేత ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. తాను వెన్నుపోటు పొడిచిన ఎన్టీఆర్ జన్మదినమైన మే 28వ తేదీన మహానాడు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. లాక్ డౌన్ 65 రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా పరామర్శించకుండా, హైదరాబాద్ లోని 300 కోట్ల రూపాయాల భవంతిలో ఎంజాయ్ చేసారని, మనవలు, మనవరాళ్లతో ఆష్టాచమ్మా ఆడుకున్నారని విమర్శించారు.
నిజంగా చిత్త శుద్ది ఉంటే రాష్ర్టానికి వస్తానన్న చంద్రబాబు ఎప్పుడో ప్రభుత్వ అనుమతి కోసం ధరఖాస్తు చేసుకునేవారని అభిప్రాయపడ్డారు. కానీ ఆయనకి ప్రజలు కన్నా తన ప్రాణమే ముఖ్యం కాబట్టి ఇంట్లో ఉండిపోయారు. ఇప్పుడు కరోనా పోదని తెలుసుకుని దైర్యం చేసి రాజకీయాలు చేయడానికి విశాఖ వచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ర్టానికి ప్రతిపక్ష హోదాలో ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టం అన్నారు. రెండు నెలలు గా జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వ పనితీరపై బురద జల్లే ప్రయత్నం చేసారని విమర్శించారు. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ఏ హామీ నెరవేర్చ లేదని ఆరోపించారు.
జగన్ ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేసారని, చంద్రబాబు అండ్ కోకి దమ్ముంటే జగన్ ఏడాది పాలనపై చర్చించడానికి ముందుకు రావాలని సవాల్ విసిరారు. వ్యవస్థలను నాశనం చేసే ప్రతిపక్ష నేత ఇప్పటికైనా మనసు మార్చుకుని కుతంత్ర రాజకీయాలు మానుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. నిన్న చంద్రబాబు నాయుడు ఏపీ పర్యటనలో భాగంగా అమరావతి చేరుకోగానే అభిమానులు ఘనంగా స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.