ఇదెక్కడి రాజకీయ పైత్యం.? టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కృష్ణ అలాగే గోదవరి నదీ బోర్డుల విషయమై కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్లపై పూర్తి అధ్యయనం చేశాకే, వాటిపై స్పందిస్తానని సెలవిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
తెలుగు రాష్ట్రాల గురించి చంద్రబాబు కంటే బాగా ఇంకెవరికి తెలుసు.? ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, పదేళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆయన. ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి, రెండేళ్ళుగా ప్రతిపక్ష నేత హోదాలో వున్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతం. అలాంటి వ్యక్తికి, గెజిట్ నోటిఫికేషన్లను పరిశీలించడం, అర్థం చేసుకోవడం అనేది రోజుల తరబడి వ్యవహారమవుతుందని ఎవరైనా అనుకోగలరా.? తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.. అన్నట్టుంది చంద్రబాబు వ్యవహారశైలి. కేంద్రం విడుదల చేసిన గెజిట్ సబబా.? కాదా.? కృష్ణా, గోదవరి నదీ బోర్డులు ఆహ్వానించదగ్గ విషయాలా కావా.? నీటి పంపకాల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ వాదనలో పస ఎంత.? ఆంధ్రప్రదేశ్ వాదనలో వాస్తవమెంత.? వంటివి తెలియకుండా వుంటారా చంద్రబాబు.? ఛాన్సే లేదు. గట్టిగా స్పందిస్తే, ఎట్నుంచి సమస్య ఎటు తిరిగి తన మీదకు దూసుకొస్తుందోనన్నది చంద్రబాబు భయం. కేంద్రాన్ని నిలదీయాలన్నా కష్టమే… తెలంగాణని తప్పు పట్టాలన్న కష్టమే. అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం అయితే చంద్రబాబుకి చాలా తేలిక. అదొక్కటే ప్రస్తుతానికి చంద్రబాబు చేయగలుగుతున్నారు.