‘హెరిటేజ్ అనే సంస్థతో నాకు సంబంధం లేదు. సంబంధం వుందని ఎవరైనా నిరూపిస్తే, బస్తీ మే సవాల్..’ అంటూ కొన్నాళ్ళ క్రితం ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడు ఆవేశంతో ఊగిపోయారు. ఇప్పుడు ఆయనే, ‘మా పాల వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నారు. హెరిటేజ్ సంస్థ మాది గనుక.. మమ్మల్ని దెబ్బ కొట్టేందుకు అమూల్ సంస్థను తీసుకొచ్చారు గుజరాత్ నుంచి..’ అంటూ చంద్రబాబు తాజాగా ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడిపోయారు. అక్కడా.. ఇక్కడా.. మాట్లాడింది చంద్రబాబే. మీకెలాంటి డౌట్ అవసరం లేదు. ఆయనంతే, అదో టైపు.
ఎప్పుడేం మాట్లడతారో ఆయనకే తెలియదు. ప్రత్యేక హోదానే రాష్ట్రానికి శ్రీరామ రక్ష.. అంటారు.. అదే నోటితో, ప్రత్యేక హోదా దండగ.. అని చెబుతారు. చంద్రబాబు ఏం చెబితే అది గుడ్డిగా ప్రజలు నమ్మాలి.. లేకపోతే, ప్రజల్ని దూషించేందుకూ, ప్రజలకు చీవాట్లు పెట్టేందుకూ చంద్రబాబు అస్సలేమాత్రం వెనుకంజ వేయరు. హెరిటేజ్ సంస్థ నిస్సందేహంగా చంద్రబాబు కుటుంబానికి చెందినదే.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. హెరిటేజ్ సంస్థ, చంద్రబాబు హయాంలో లాభాలు పొందుతుంటుంది.. చంద్రబాబు అధికారంలో లేకపోతే.. నష్టాల పాలవుతుందన్న విమర్శ చాలాకాలంగా వుంది. అందులో నిజమెంత.? అన్నది వేరే చర్చ. హెరిటేజ్ సంస్థ కోసం చంద్రబాబు, తెలుగు నాట చాలా డెయిరీలను దెబ్బ కొట్టారు.. సొంత జిల్లా చిత్తూరులోనూ పాడి రైతుల నోట్లో మట్టికొట్టారన్న విమర్శల సంగతి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది.? అలాంటి చంద్రబాబు, ఇప్పుడెందుకు పాల వ్యాపారం గురించి తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ప్రస్తావించినట్లు.? ఆయన ఉద్దేశ్యం ఏదైనా, చంద్రబాబు వ్యాఖ్యల దెబ్బకి.. టీడీపీ పరువు నిజంగానే పోయింది ఈసారి.