ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు త్వరపడుతున్నారు. ఆలస్యం చేస్తే లాభం లేదన్నట్టు దూకుడుగా వెళుతున్నారు. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావొస్తోంది. కమిలి ఎన్నికలు వస్తాయనే ఆశలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే దఫాలో ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనే దృఢ సంకల్పంతో ఉన్నారాయన. అందుకే అందివచ్చిన అవకాశాలనే కాదు లేని అవకాశాలను సృష్టించుకుని మరీ ముందుకుపోతున్నారు. అందుకు సాక్ష్యమే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చూపిస్తున్న దూకుడు. ఇన్నాళ్లు హుందాతనం, 40 ఏళ్ల అనుభవం ఉన్న తానేమిటి వైసీపీ ఎమ్మెల్యేలతో మాటల యుద్దానికి దిగడం ఏమిటని అనుకునేవారు. కానీ ఇప్పుడు దిగేశారు. పూర్తిగా 40 ఇయర్స్ మత్తు వదిలేసి రండి చూసుకుందాం అన్నట్టు తయారయ్యారు.
అవతల మాట్లాడేది ఎవరైనా సరే తానే అందుకుంటూ సమాధానాలు, సవాళ్లతో దూకుడుగా కనిపిస్తున్నారు. ఉన్నట్టుండి పెరిగిన ఈ స్పీడ్ చూస్తే ఆయనలో పుట్టుకొచ్చిన ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందులా ప్రతిపక్షంలో ఉన్నా తాపీగా కూర్చుని చూసే వయసు కాదు ఆయనది. ఇప్పటికే 70 ఏళ్ళు వచ్చేశాయి. ఈసారి ఎన్నికల్లో సీఎం అవ్వలేదంటే ఇక కావడం దాదాపు అసాధ్యమనే అనాలి. అప్పటికి ఆయన వారు 80 కి దగ్గరవుతుంది. ఆశ ఉన్నా ఓపిక ఉండాలి కదా. అందుకే ఈసారి రాబోయే ఎన్నికలనే చివరి అవకాశం అన్నట్టు భావిస్తున్నారు. పైపెచ్చు ఈసారి గనుక పుంజుకోకపోతే తనకే కాదు పార్టీకి కూడ భవిష్యత్తు ఉండదని భయపడుతున్నారు.
ఆ భయంతోనే కూటమి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొదటి నుండి బీజేపీని కలుపుకోవాలని చూస్తున్న చంద్రబాబుకు నిరాశే ఎదురవుతూ వచ్చింది. బీజేపీ కలిసొస్తే పవన్ కూడ వెంట ఉంటాడనేది బాబుగారి స్ట్రాటజీ. కానీ బీజేపీ ససేమిరా దగ్గరకు రానివ్వడంలేదు. పొత్తు మాట అటుంచి మీరే మా టార్గెట్ అంటున్నారు. సోము వీర్రాజు కొత్త అధ్యక్షుడు కావడం జీవీఎల్ నరసింహారావు, సునీల్ ధియోధర్ లాంటి నేతలు అడ్డుపడుతుండటంతో బీజేపీతో కలయిక దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. అందుకే ఇకపైనా రాష్ట్ర నాయకులను దువ్వి ప్రయోజనం లేదని గ్రహించిన ఆయన ఇతర రాష్ట్రాల బీజేపీ నాయకుల వైపు నుండి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు.
ఇటీవలే నాగ్ పూర్ కు చెందిన ఒక ముఖ్యమైన బీజేపీ నాయకుడితో చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నారట చంద్రబాబుగారు. ఆయన ద్వారా బీజేపీ అగ్రనాయకత్వానికి దగ్గరగా వెళ్లి తన ఆలోచనను బయటపెట్టాలని, అమిత్ షా లాంటి వారిని కన్విన్స్ చేయాలని చూస్తున్నారట. పైనున్న వారిని మేనేజ్ చేస్తే రాష్ట్ర శాఖను దారిలోకి తెచ్చుకోవడం సులభమనేది ఆయన ప్లాన్ కావొచ్చు. మరి చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి.