Chandrababu & Raghurama : చంద్రబాబు, రఘురామకృష్ణరాజు.. ఓ ఆలింగనం.!

Chandrababu & Raghurama : అరరె, ఇది నిజంగానే అద్భతమైన ఘట్టం. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ వైఎస్సార్సీపీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు పరస్పరం ఒకర్నొకరు ఆలింగనం చేసుకున్నారు. తిరుపతి వేదికగా అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఈ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.

ప్రస్తుతం రఘురామకృష్ణరాజు వైసీపీకి దూరంగా వుంటున్నారు. ఆ మాటకొస్తే, ఆయన సొంత నియోజకవర్గానికీ.. సొంత రాష్ట్రానికి కూడా దూరంగానే వుంటున్నారు. చాలాకాలమైంది ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళి. తాను నర్సాపురం నియోజకవర్గానికి వెళితే, తన మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందన్నది ఆయనగారి ఆరోపణ.

భయపడేవాడు నాయకుడెలా అవుతాడు.? నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టనివాడు ప్రజా ప్రతినిథి ఎలా అవుతాడు.? అన్నది వేరే చర్చ. అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి రఘురామ, తిరుపతికి వచ్చారు. పాత మిత్రుడు చంద్రబాబుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

అమరావతి ఎక్కడికీ పోదనీ, రాజధాని అమరావతిలోనే వుంటుందనీ, అమరావతిని ఎవరూ కదల్చలేరనీ రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. తిరుపతి బహిరంగ సభ తర్వాత మూడు రాజధానుల గురించి ఎవరూ మాట్లాడబోరని కూడా రఘురామ చెప్పుకొచ్చారు.

కామెడీ కాకపోతే, ఓ వైపు ఏకైక రాజధాని అమరావతి వద్దు.. మూడు రాజధానులే ముద్దు.. అంటూ కొందరు నినదిస్తున్నారాయె. ఆ దిశగానే వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందామె. సరే, ఆ విషయం పక్కన పెడితే, చంద్రబాబుని ఆలింగనం చేసుకోవడం ద్వారా టీడీపీతో తనకున్న సంబంధాన్ని రఘురామ చెప్పకనే చెప్పేశారన్నమాట.