టీడీపీ అంటేనే వారసత్వాల పార్టీ. ఆ పార్టీ ఎవరి నుంచి చంద్రబాబుకు వచ్చిందో అందరికీ తెలుసు. చంద్రబాబు తర్వాత ఆయన కొడుకు లోకేశ్ కూడా ఉన్నారు. అంటే.. చంద్రబాబు తర్వాత లోకేశే ఆ పార్టీకి పెద్దదిక్కు. అలాగే.. ఏపీలోని అన్ని జిల్లాల టీడీపీ నాయకులతో పాటు.. వాళ్ల వారసులనూ చంద్రబాబు పార్టీలో ప్రోత్సహించారు. ముఖ్యమైన నాయకుడు పార్టీ నుంచి తప్పుకుంటే.. ఆ నాయకుడి వారసుడిని పార్టీలో తీసుకొని తర్ఫీదు ఇచ్చి మరీ చంద్రబాబు పదవులు ఇచ్చేవారు. దీంతో టీడీపీ కాస్త వారసుల పార్టీగా మారింది.
ఉదాహరణకు… శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయకుడు ఎర్రనాయుడు బతికి ఉన్నప్పుడే.. ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడిని ప్రోత్సహించారు చంద్రబాబు. ఎర్రనాయుడు చనిపోయాక… ఆయన కొడుకు రామ్మోహననాయుడును పార్టీలో తీసుకొని ఎంపీని చేశారు.
అలాగే… శ్రీకాకుళం జిల్లాకే చెందిన మరో నేత గౌతు శ్యామ సుందర శివాజీ కూతురు శిరీషకు గత ఎన్నికల్లో పలాస టికెట్ ను ఇచ్చారు. ఆ తర్వాత ఆమె శ్రీకాకుళం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు మంది ఉన్నారు. చాలామంది నాయకుల వారసులను చంద్రబాబు ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
అయితే.. అదే జిల్లాకు చెందిన కావలి ప్రతిభా భారతిని మాత్రం చంద్రబాబు ఎందుకో పట్టించుకోవడం లేదు. ఆమెను సైడ్ చేశారు చంద్రబాబు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. పొలిట్ బ్యురోలో ఉన్న తనను.. జాతీయ ఉపాధ్యక్షురాలిగా చేశారు. తన కూతురు గ్రీష్మకు గత ఎన్నికల్లో సీటు ఇస్తానని ఇవ్వలేదు. ఇప్పుడు రాజాం నియోజకవర్గ ఇన్ చార్జి పదవి అయినా ఇవ్వాలంటూ ఆమె కోరుతున్నా చంద్రబాబు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదట.
పార్టీలోని అందరు నాయకుల వారసులకు మంచి స్థానం కల్పించిన చంద్రబాబు.. తన కూతురుకు మాత్రం అన్యాయం చేస్తున్నారు. తన కూతురుకు టికెట్ ఇస్తానని మోసం చేశారు. చివరకు ఇన్ చార్జ్ పదవి కూడా ఇవ్వడం లేదంటూ ఆమె ఆరోపిస్తున్నారట.
ఒకవేళ చంద్రబాబు ఇలాగే నాన్చుడు ధోరణితో ఉంటే.. ఆమె టీడీపీని వీడి.. వైసీపీలో చేరడానికి కూడా సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆమె వైసీపీలో చేరితే.. రాజాం నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దెబ్బే పడుతుందని.. చంద్రబాబు ఎందుకు ప్రతిభ విషయంలో ఇలా ఉన్నారు అనే విషయం టీడీపీ శ్రేణులకు కూడా అర్థం కావడం లేదట. చంద్రబాబు కావాలని తన సామ్రాజ్యాన్ని తానే కూల్చుకుంటున్నారా? అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.