ష్చ్.. బాబు గారు నిలుపుకుంటారా..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజకీయాలలో ఉన్న 40 ఏళ్ళ అనుభవం వైసీపీ ఫ్యాన్ స్పీడుకు తుడిచిపెట్టుకుపోతుంది. మొన్న ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలైనప్పటి నుంచి చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. వరుసగా నేతలంతా పార్టీనీ వీడడంతో ఇప్పట్లో టీడీపీ తిరిగి పుంజుకునేలా కనిపించడం లేదు. 23 స్థానాలతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన టీడీపీకి ఇప్పుడు ఆ స్థానం కూడా దక్కేలా లేదు.

ఇప్పటికే టీడీపీకి చెందిన వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరాంలు జగన్ కు జై కొట్టడంతో చంద్రబాబు బలం 20కి పడిపోయింది. కొద్ది రోజులుగా వలసల నుంచి కాస్త రిలీఫ్ దొరికిన చంద్రబాబుకు మళ్ళీ వలసల టెన్షన్ మొదలయ్యింది. ఆషాడం వెళ్లిపోవడంతో ఆకర్ష్ ప్రారంభమైనట్టుంది. నిన్నటిదాక మంచి ముహుర్తాలు లేకపోవడంతో సైలెంట్‌గా ఉన్న నేతలంతా ఇప్పుడు అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆగష్టు 15 వ తేదిన అధికార వైసీపీ పార్టీ ఇళ్ల పట్టాల పంపిణీనీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుండడంతో ఇదే కార్యక్రమ వేదికగా గంటా వైసీపీలో చేరబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

అయితే ఇదే నిజమై గంటా టీడీపీనీ వీడి వైసీపీలో చేరితే కనుక చంద్రబాబు బలం 19 కి పడిపోనుంది. ఇదిలా ఉండగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కనుక టీడీపీనీ వీడితే చంద్రబాబుకు ఉన్న ప్రతిపక్ష హోదా కూడా ఊడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎమ్మెల్యే వైసీపీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని వైసీపీ కూడా వీరిపై ఫోకస్ పెట్టడంతో చంద్రబాబు అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. అందుకే చంద్రబాబు తన ఎమ్మెల్యేలందరితో టచ్‌లో ఉండి వారికి భరోసా ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా జగన్ దెబ్బకు చంద్రబాబు చివరకు ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు కూడా పాట్లుపడాల్సి వస్తుంది.