ఎన్నికల్లో ఓడిపోయిన పరాభవం ఒకవైపు, భవిష్యత్తులో కోలుకుంటామో లేదో అనే దిగులు ఇంకోవైపు తరుముతుండగా నేతల జంపింగ్ చంద్రబాబును తెగ కలవరపెడుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీకి దగ్గరగా ఇంకొంతమంది ఆ జాబితాలో ఉన్నట్టు తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ నేత కళా వెంకటరావు సైతం పార్టీని వీడతారనే ప్రచారం జోరుగా నడిచింది. నిన్న మొన్నటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కళా వెంకటరావు. ఆయన్ను తప్పించి ఆ పదవిని అచ్చెన్నాయుడుకు అప్పగించారు చంద్రబాబు. అటు ప్రజాక్షేత్రంలో పదవి లేకపోవడం పార్టీలో ఉన్న అధ్యక్షుడి హోదా పోవడంతో కళా నిరుత్సాహపడిపోతున్న మాట నిజమే.
పైగా అధికార పార్టీ నుండి ఒత్తిడిలు ఎక్కువవుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియట్లేదు. ఇవతల చంద్రబాబు చూస్తే తనను తానే కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కళా వెంకటరావు పార్టీని వీడతారని, బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని గుసగుసలు మొదలయ్యాయి. బీజేపీ సైతం ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. దీంతో చంద్రబాబుకు కంగారు మొదలైంది. కళా వెంకటరావు మిగతా వాళ్ళలాగా సాదా సీదా నాయకుడు కాదు. పదవిలో లేకపోవచ్చు కానీ శ్రీకాకుళం జిల్లాలో ఆయనకు బలమైన కేడర్ ఉంది. తెలుగుదేశాన్ని ఒంటి చేత్తో గెలిపించలేకపోయినా జిల్లాలో ఆ పార్టీ ఓట్ షేర్ మీద పెను ప్రభావం చూపగలరు.
అలాంటి లీడర్ పార్టీని వీడితే మిగిలిన మూడు నాలుగు జిల్లాల నుండి శ్రీకాకుళం చేజారినట్టే. మొదటి నుండి శ్రీకాకుళం టీడీపీకి కంచుకోటలా ఉంది. గత ఎన్నికల్లో అది కాస్త కంపించినా మిగతా జిల్లాల తరహాలో కూలిపోలేదు. ఇప్పుడు కల వెంకటరావు హ్యాండ్ ఇస్తే ఒకవైపు నుండి కూలిపోవడం ఖాయం. ఇక కళా వెంకటరావు సంగతే తీసుకుంటే గతంలో ఆయన టీడీపీ నుండి ప్రజారాజ్యంలోకి జంప్ చేసి ఆ తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. అంటే ఆయనకు పార్టీ మారడంలో ఇబ్బందులేవీ లేవు. ఇవన్నీ అధినేతకు వణుకు పుట్టించాయి. కళా వెంట్రావు లేని శ్రీకాకుళం టీడీపీని ఊహించుకోలేకపోయారు ఆయన. అందుకే వెంటనే సంప్రదింపులు స్టార్ట్ చేశారట. అయితే బాబుగారు భయపడినట్టు కళా పార్టీ మారే యోచనలో లేరు. తాను పార్టీలోనే ఉంటానని మాటిచ్చారట. దీంతో చంద్రబాబు ఊపిరిపీల్చుకున్నారట. మొత్తానికి కళా వెంకటరావు ఒక్క క్షణం బాబుగారి వెన్నులో వేణుకు పుట్టించారనే అనుకోవాలి.