చంద్రబాబు నాయుడుగారికి కూటమి రాజకీయాలు, పొత్తు రాజకీయాల మీద ఆశ ఎక్కువ. అందుకే ఎలాంటి స్థితిలో ఉన్నా చేతులు చాచిపెట్టే ఉంటారు. మిత్ర పక్షాల కోసం తలుపులు తెరిచే ఉంటారు. ఆయన హయాంలో టీడీపీ పెట్టుకున్నన్ని పొత్తులు మరే పార్టీ పెట్టుకుని ఉండదు. ప్రజెంట్ కుప్పకూలిన స్థితిలో ఉన్న ఆయన ఏదైనా ఒక మిత్ర పక్షం దొరికితే బాగుండని, ఒక పొలిటికల్ ఫ్రెండ్ పక్కనుంటే మేలని ఆలోచిస్తున్నారు. ఆయన చూపంతా భారతీయ జనతా పార్టీ మీదే ఉంది. పార్టీ ఉన్న సిట్యుయేషన్లో బీజేపీతో దోస్తీ చాలా అవసరమని ఆయన అనుకుంటున్నట్టున్నారు. అంటే ఇక్కడ బీజేపీ ఏదో 30, 40 సీట్లు గెలిచే సత్తా ఉన్న పార్టీ అని కాదు. కేంద్రంలో ò చే పెత్తనం స్తున్న పార్టీ కాబట్టి పొత్తుకు చూస్తున్నారు.
2024లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ టీడీపీని విజయతరాలకు చేర్చలేకపోవచ్చు కానీ ప్రస్తుతాకైతే దిక్కు తెలియని తీరానికి కొట్టుకుపోకుండా ఆపగలదు. కేసుల భయం, అరెస్టుల అలజడి నుండి బయటకు తీసుకురాగలదు. అందుకే బాబుగారి తాపత్రయం. కాబట్టే బీజేపీ మీద నోరెత్తడంలేదు. వారేం మాట్లాడినా, విమర్శించినా తిరిగి ఒక్కమాట అనడం లేదు. 2014లో పెట్టుకున్న పొత్తు విడిపోయాక, గత ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీని ఎలా ఎండగట్టారో మనం చూశాం. హోదా కారణాన్ని చూపిస్తూ మోదీని అసలు రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చేయాలని పిలుపునిచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పల్లెత్తు మాట అనడం లేదు.
తాజాగా అంతర్వేది ఘటన మీద స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్రంలో అన్య మతాన్ని ప్రోత్సహిస్తున్నారని వైసీపీ, టీడీపీల మీద విరుచుకుపద్దారు. బాబు క్రైస్తవుల కోసం పెట్టిన పథకాలను చూపించి విమర్శలు గుప్పించారు. హిందూ మతం మీద జరుగుతున్న దాడికి బాబు కూడ ఒక రీజన్ అన్నట్టు మాట్లాడారు. అంతేనా ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని ఎన్డీయేలో భాగస్వామ్యం కానివ్వబోమని తేల్చి చెప్పారు. వీర్రాజు ఇంత మాట్లాడినా బాబు తిరిగి కౌంటర్ ఇవ్వలేదు. కనీసం టీడీపీ నుండి ఏ లీడరూ ఖండించలేదు. ఈ మౌనవ్రతం చూస్తుంటే బాబుగారి మనసులో బీజేపీ మీద ప్రేమ ఏ స్థాయిలో పొంగిపొర్లుతుందో అర్థం చేసుకోవచ్చు.