ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న జీవ కళ ఇప్పుడు లేదు. అప్పట్లో టీడీపీ అంటే ప్రజల్లో ఒక స్థాయి ఉండేది. కానీ ఇప్పుడు టీడీపీనా.. పాపం అనే జాలి మిగిలింది. అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం ప్రభావం రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చేసేది. ఇప్పుడు.. ఎవరు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకుంటే తమకు ఏ చిక్కు వస్తుందోననే ఆందోళనలో ఉంది. ఇందుకు కారణం నాయకత్వ లోపమని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒకప్పుడు ఒక్కో ప్రాంతంలో టీడీపీకి ఒక బలమైన కుటుంబం అండ ఉండేది. పార్టీ మాస్ లీడర్లతో కళకళలాడేది. ముఖ్యంగా సీమ జిల్లాల్లో మాడ్ లీడర్ల ప్రభావం గట్టిగా పనిచేస్తుంటుంది. అక్కడి ఓటర్లు పార్టీలను కాదు వ్యక్తుల మొహాలు చూసి ఓట్లు వేస్తుంటారు. అందుకు ఉదాహరణే గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం. ఒకప్పుడు సీమలో టీడీపీకి కొండంత అండగా పరిటాల రవీంద్ర కుటుంబం ఉండేది.
అనంతపురం కేంద్రంగా సీమ రాజకీయాన్ని మొత్తం నడిపేవారు పరిటాల రవీంద్ర. ఆయన మరణం అనంతరం ఆయన సతీమణి పరిటాల సునీత కొంత వరకు రవీంద్ర లేని లోటును పార్టీలో భర్తీ చేయగలిగినా ఎదిగివస్తున్న రాజకీయ ప్రత్యర్థులను అధిగమించడంలో మాత్రం విఫలమయ్యారు. పరిటాల వర్గీయులు, టీడీపీ క్యాడర్ సైతం పరిటాల వారసుడు శ్రీరామ్ మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ గత ఎన్నికల్లో సరైన ప్లానింగ్ లేక పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుండి బరిలోకి దిగి ఓడిపోయారు. అసలు శ్రీరామ్ తన తండ్రి రవీంద్ర మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెనుకొండ నియోజకవర్గం నుండి బరిలోకి దిగితే బాగుంటుందని కొందరు అన్నారు. కానీ రాప్తాడు నుండి పోటీచేసి 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఆ ఓటమి కారణంగా పరిటాల ఫ్యామిలీ నీరసపడిపోయింది. దాంతో సీమలో టీడీపీ క్యాడర్ దాదాపు సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు వారందరిలో హుషారు నింపాలంటే పరిటాల కుటుంబాన్ని యాక్టివ్ చేయాలి. అందుకే చంద్రబాబు టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడిగా పరిటాల శ్రీ రామ్ ను నియమించాలని అనుకుంటున్నారట.
ఈ మార్పు రాష్ట్ర వ్యాప్తంగా కూడ ప్రభావం చూపుతుందని బాబుగారు భావిస్తున్నారట. మొదట ఈ పదవిని ఎంపీ రామ్మోహన్ నాయుడుకి ఇవ్వాలని అనుకున్నా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అచ్చెన్నాయుడుకు ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి తెలుగు యువత అధ్యక్షుడి పదవిని వేరొకరికి ఇవ్వాలని భావించి శ్రీరామ్ పేరును పరిశీలిస్తున్నారట. మరి నిజంగానే పరిటాల ఫ్యామిలీకి పార్టీలో పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి.