విశాఖ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుకు ప్రత్యేక స్థానం ఉంది. విశాఖలోని ఏ స్థానం నుండైనా పోటీచేసి నెగ్గగల సామర్థ్యం ఆయన సొంతం. ఎందుకే ఆయన ఏ పార్టీలో ఉన్నా పవర్ సెంటర్ అవుతుంటారు. కానీ ఆయనలోని ఒకే ఒక్క డిఫెక్ట్ పవర్ పాలిటిక్స్. అధికారం, పదవి లేకపోతే అస్సలు ఉండలేరనే అపవాదు ఉంది ఆయన మీద. అదే నిజం కూడ. టీడీపీ ఓడిపోవడంతో ఆయన వైసీపీలోకి వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సంగతి గుర్తించిన వెంటనే చంద్రబాబు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. త్వరలో రాజధాని కానున్న విశాఖలో గంటా లాంటి బలమైన లీడర్ పార్టీలో లేకుంటే చాలా కష్టమవుతుందని భావించి ఏదో రకంగా పార్టీలో ఉంచాలని ట్రై చేశారు.
కానీ గంటా వినే స్థితిలో లేరు. ఇప్పటికే వైసీపీలో ప్రధాన నాయకులను మేనేజ్ చేసి పెట్టుకుని రేపో మాపో మకాం మార్చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు సైతం గంటాను బ్రతిమాలి విసిగిపోయారు. అందుకే ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడికి పార్టీలో ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల ప్రకటించిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గంలో అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. చింతకాయల విజయ్ చాలా ఏళ్లుగా పార్టీ పనుల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలని అయ్యన్న చాలా ట్రై చేశారు. కానీ కుదలేదు.
ఇప్పుడు మాత్రం చంద్రబాబే పిలిచి మరీ పదవి ఇచ్చారు. ఈ పరిణామంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడ కన్ఫర్మ్ అంటున్నారు విశాఖ తెలుగు తమ్ముళ్లు. ఇక ఇప్పటివరకు ప్రకటించిన పదవుల్లో గంటాకు ఆయన ప్రధాన అనుచరులకు ఒక్క పదవీ దక్కలేదు. అంతా బాగుంటే గంటాకు కీలకమైన పదవి ఏదో ఒకటి ఇచ్చేవారు. దీన్నిబట్టి గంటా మీద చంద్రబాబు పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారని అర్థమవుతోంది. అంతేకాకుండా ఆయనకు ప్రత్యామ్నాయంగా చింతకాయల విజయ్ ను ప్రోత్సహిస్తున్నారని రూఢీ అయింది. ఈ పరిణామాలతో అయ్యన్నపాత్రుడు, ఆయన వర్గం సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపైనా విశాఖ తమదేనన్న ఫీలింగ్లో ఉన్నారు.