ఎంత ఘోరంగా ఓడిపోయినా, ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, ఎంత స్వార్థంగా పనిచేసినా చంద్రబాబు నాయుడుకు ట్రేడ్ మార్క్ రాజకీయం అంటూ ఒకటి ఉంది. అదే పొత్తుల రాజకీయం. శత్రువుకి శత్రువు మనకి మిత్రుడే కదా అనేది ఆయన ఫార్ములా. ఆ ఫార్ములాను అనుసరించే పొత్తులు పెట్టుకుంటూ కూటములు కడుతుంటారు. ఈ తరహా రాజకీయం రాష్ట్రంలో ఆయనకు తప్ప మరొకరికి చేతకాదు. ఈ పద్దతి అస్తమానం పనిచేయకపోయినా అప్పుడప్పుడు పనిచేస్తుంది. 2014 ఎన్నికల్లో పనిచేయబట్టే అధికార పీఠాన్ని దక్కించుకోగలిగారు. అందుకే 2024కి కూడా అదే ఫార్ములను అమలు చేయాలనేది ఆయన ప్లాన్.
ఒక్కరితో కాదు.. అందరితో :
అయితే ఈ పొత్తుల రాజకీయాన్ని సాదాసీదాగా కాకుండా భారీ ఎత్తున అమలుచేయాలని చూస్తున్నారట అయన. అంటే.. ఏదో ఒక పార్టీతో కాకుండా అన్ని పార్టీలతో పొత్తులు పెట్టేసుకుంటారట. వైసీపీని మినహాయిస్తే మిగతా పార్టీలు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు. ఈ నాలుగింటినీ ఒక తాటి మీదకు తెచ్చి పక్కన కూర్చోబెట్టుకోవాలనేదే ఆయన ప్లాన్. ఈ ప్లాన్ అంతిమ లక్ష్యం ఒక్కటే.. అదే వైసీపీ వ్యతిరేక ఓట్లను ఒక గంపలోకి తీసుకురావడం. అన్ని పార్టీలు ఎవరికివారు విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ వ్యతిరేక ఓట్లను తలా కొంచెం పంచుకుంటారు. దాని వలన ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు. మళ్ళీ అధికారం వైసీపీకే వెళుతుంది.
అలా కాకుండా అందరూ చేతులు కలిపేస్తే వ్యతిరేక ఓటు బ్యాంకు ఒక దగ్గరే ఉంటుంది. అప్పుడు వైసీపీని మించిన ఓటింగ్ పర్సెంటేజ్ కూటమికి దక్కుతుంది. ఎలాగూ కూటమికి పెద్ద దిక్కుగా తానే ఉంటారు కాబట్టి సీఎం పీఠం తనకే వస్తుందనేది బాబుగారి ఆలోచనట. గత ఎన్నికల్లో వైసీపీ 50 శాతానికి దగ్గరగా ఓటింగ్ శాతాన్ని అందుకుంది. ఈసారి అంత రాదనీ, జగన్ ఎంత గొప్పగా పెర్ఫార్మ్ చేసినా 40 నుండి 45 శాతానికి మాత్రమే పరిమితమవుతుందని అప్పుడు మెజారిటీ ఓట్ షేర్ కూటమిలో ఉంటుందని లెక్కలు వేస్తున్నారట.
అన్నీ పగటి కలలేనా ?
చంద్రబాబు వేసిన లెక్కలు వినడానికి బాగానే ఉన్నాయి. నిజంగా వర్కవుట్ అయి వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు మొత్తం ఒక చోట చేరితే బాబుగారికి అధికారం దక్కే ఛాన్స్ లేకపోలేదు. కానీ అలా అన్ని పార్టీలు ఆయన కిందకు చేరడం సాధ్యమేనా అనేదే ప్రశ్న. ఇప్పటికిప్పుడు టీడీపీతో కలవడానికి ఒక్క కాంగ్రెస్ పార్టీ మినహా మిగత ఏ పార్టీ సిద్ధంగా లేదు. పవన్ చూస్తే నీ పొత్తే నాకొద్దని దండం పెడుతున్నాడు. బీజేపీ అయితే ఎంత కవ్వించినా ఛీ పొమ్మని ముఖం మీదే తలుపులు వేసేసింది. ఇక వామపక్ష పార్టీలైతే ఎవరిని నమ్మినా చివరికి గొంతుకోస్తున్నారనే భావనలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు కూటమి కలలన్నీ పగటి కలలుగానే మిగిలిపోతాయేమో.