గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని రాష్ట్రం మొత్తం తిరస్కరించినా విశాఖ నగరం మాత్రం కాస్త ఆదరించింది. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇలా నాలుగు దిక్కుల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలే ఉండటం జగన్ కు నచ్చలేదు. ఎందుకంటే విశాఖను ముఖ్యమైన పాలనా రాజధానిగా చేయనున్నారు. ఇప్పటికే ప్రక్రియ మొదలైంది. కోర్టులో స్టే తొలగిపోయిన మరుక్షణమే విశాఖ నుండి పాలన మొదలవుతుంది. అందుకే జగన్ విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉంటే కష్టమని అనుకున్నారో ఏమో కానీ పార్టీ గేట్లు తెరిచారు.
విశాఖ ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రత్యేకంగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. పార్టీకి సానుకూలంగా నడుచుకోవచ్చని సంకేతాలిచ్చారు. ఇంకేముందు వైసీపీ పెద్దలు మంతనాలు స్టార్ట్ చేశారు. ఇప్పటికే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీని వీడి వైసీపీకి జైకొట్టారు. వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు సైతం తెలుగుదేశానికి దూరం జరిగారు. ఇక ఇన్నాళ్లు విశాఖలో టీడీపీకి కీలకంగా ఉంటూ వచ్చిన నార్త్ అసెంబ్లీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారడానికి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈయన కేసు కొంచెం డిఫరెంట్. నేరుగా జగన్ వద్ద నుండే కొన్ని సౌలభ్యాలను ఆశిస్తున్నారు ఈయన. ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలు గోడ దూకేయడంతో విశాఖలో తెలుగుదేశం బలహీనపడిపోయింది.
అక్కడ చంద్రబాబుకు మిగిలిందల్లా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఒక్కరే. ఆయన మాత్రమే వైసీపీ వైపుకు తల తిప్పకుండా పార్టీని కాచుకుని ఉన్నారు. ఉన్న నలుగురిలో ముగ్గురు వెళ్ళిపోయినా, భవిష్యత్తులో సమస్యలు వస్తాయని తెలిసినా ఒంటరిగానే పార్టీని అంటుపెట్టుకుని ఉన్న వెలగపూడి మీద చంద్రబాబుకు చాలా నమ్మకం ఏర్పడింది. అందుకే ఆయన్ను పార్టీలో కీలకంగా ఉంచాలని డిసైడ్ అయ్యారట. విశాఖ పార్టీ బాధ్యతలు మొత్తాన్ని ఆయనకే అప్పగించేసి ఇక అంతా నీదే చూసుకోమని చెప్పేశారట. వెలగపూడి కూడ బాబుగారి ఆజ్ఞను అందుకుని పార్టీ కార్యకలాపాను వేగవంతం చేస్తున్నారట. ఇటీవల జరిగిన గీతం కట్టడాల కూల్చివేత వివాదంలో పార్టీ తరపున గట్టిగా నిలబడి గళం వినిపించారు. ఇక మీదట విశాఖ పార్టీ పనులన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటారని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.