తెలుగుదేశం పార్టీ మొదటి నుండి బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా దర్శి కూడ ఒకటి. ఇక్కడ మొదటి నుండి కాంగ్రెస్ పార్ట్ హావానే నడుస్తోంది. ఆ తర్వాత ఇప్పుడు వైకాపా వేవ్ కనబడుతోంది. ఇక్కడ బలపడటానికి చంద్రబాబు నాయుడు ఎన్ని వ్యూహాలు వేసినా చాలావరకు విఫలమవుతూనే వస్తున్నాయి. ఒక్క శిద్దా రాఘవరావు మినహా చంద్రబాబు దింపిన మిగతా నేతలంతా చేతులెత్తేసిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు పగ్గాలు అప్పగిస్తున్న లీడర్లు కూడ సామాన్యమైన వారేమీ కాదు. వారి పలుకుబడి ఉన్న రాజకీయ నేతలే. అయినా దర్శిలో పార్టీని నిలబెట్టలేకపోతున్నారు. టీడీపీ పుట్టాక 1994లో ఇక్కడ నారపశెట్టి శ్రీరాములు గెలుపొందారు. ఆ తర్వాత 99, 2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలైంది.
2004 ఎన్నికల్లో టీడీపీ నుండి బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగిన కదిరి రాంబాబు ఓటమిపాలయ్యారు. అలాగే 2009లో చంద్రబాబు దింపిన ఎన్నారై అభ్యర్థి మన్నం వెంకటరమణ సైతం ఓటమిపాలయ్యారు. ఇలా ఇద్దరు ఓడిపోగా 2014లో చంద్రబాబు నాయుడు బోలెడు ఆశలు పెట్టుకుని టికెట్ ఇచ్చిన శిద్దా రాఘవరావు గెలుపొందారు. దీంతో ఇకపై అక్కడ పార్టీకి తిరుగులేదని భావించారు. రాఘవరావు కూడ పదవిలో ఉన్నన్ని రోజులు అక్కడ ఆపార్టీ బలోపేతానికి కృషిచేశారు. చంద్రబాబు కూడ ఆయనకు మంత్రి పదవి ఇచ్చి పోత్సహించారు. కానీ ఎలక్షన్లలో బాబుగారు చేసిన ప్రయోగం వికటించి పార్టీ మరోసారి పాతాళానికి పడిపోయింది.
బలంగా కేడర్ ఏర్పరుచుకుని ఉన్న శిద్దా రాఘవరావును దర్శి నుండి కాకుండా ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపారు. ఆయన స్థానంలో మరోసారి కదిరి రాంబాబుకు అవకాశం ఇచ్చారు. ఆ టైంలో రాంబాబు కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా ఆయన్ను తీసుకొచ్చి దర్శిలో నిలబెట్టారు. దీంతో అటు ఎంపీ ఎన్నికల్లో శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే ఎన్నికల్లో కదిరి రాంబాబు ఇద్దరూ ఓడిపోయారు. అటు కనిగిరిలో సైతం టీడీపీ ఓటమిపాలైంది. ఇలా బాబుగారు చేసిన పనికి రెండు ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ స్థానంలో పార్టీ బోల్తాకొట్టేసింది. తప్పు తెలుసుకున్న ఆయన తిరిగి దర్శిని శిద్దా రాఘవరావు చేతికి ఇవ్వాలని అనుకున్నారు.
కానీ పలు కారణాల రీత్యా శిద్దా రాఘవరావు వైసీపీ కండువా కప్పుకోవాల్సి వచ్చింది. పైగా పోటీచేసి ఓడిన కదిరి రాంబాబు సైతం ఫ్యాన్ గూటికే చేరుకున్నారు. అలా దర్శి, కనిగిరి రెండు చోట్ల టీడీపీ దెబ్బైపోయింది. ప్రధానంగా దర్శిలో తెలుగుదేశం జెండా మోయడానికి చెప్పుకోదగిన లీడర్ కరువయ్యారు. దీంతో చేసేది లేక గతంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన పమిడి రమేష్ కు పగ్గాలు అప్పగించారు. అసలే వైసీపీ పూర్తి ఊపులో ఉన్న తరుణంలో పార్టీని బలోపేతం చేయడమంటే పమిడి రమేష్ కు కత్తి మీద సాము అనే అనాలి.