ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమే.! కానీ, చంద్రబాబుకెందుకంత మొహమాటం.!

జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకోవాలనుకుంటోందా.? లేదా.? అబ్బే, ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టత ఇవ్వరు. కానీ, టీడీపీ అను’కుల’ మీడియా ద్వారా మాత్రం జనసేన మీద వలపు బాణాల్ని సంధిస్తుంటారు. అంతేనా, పార్టీ కార్యకర్తలతోనూ, ‘జనసేనతో టీడీపీ పొత్తు వుండాలి..’ అని అనిపిస్తారు, అరిపిస్తారు కూడా.!

ఇప్పుడు కొత్తగా బీజేపీ – టీడీపీ పొత్తు గురించిన చర్చ జరుగుతోంది. టీడీపీ అను’కుల’ మీడియాలోనూ, బీజేపీ అనుకూల మీడియా (నేషనల్ మడియా)లోనూ ఈ మేరకు కథనాలు వస్తున్న విషయం విదితమే. ఇంతకీ, చంద్రబాబు మనసులో ఏముంది.? ఇంకేముంటుంది.? ఆయన మనసులో మాటే, టీడీపీ అను’కుల’ మీడియా ద్వారా ఇప్పటికే బయటకు వచ్చేసింది.

కానీ, చంద్రబాబు ఏ విషయాన్నీ నేరుగా చెప్పరు. ‘2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసమే.. 2018లో బీజేపీతో విడిపోయిందీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే.. 2024 ఎన్నికల్లో ఏం చేసినా.. అదీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే..’ అని సెలవిచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాజాగా.

‘ఇంతకీ, ఎన్డీయేలో చేరికపై మీరేమంటారు.?’ అనడిగితే, ‘అలాప ప్రచారం చేస్తున్నవారినే అడగండి..’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంటే, టీడీపీ అను’కుల’ మీడియా ప్రతినిథులే, తమ యాజమాన్యాల్ని ఈ విషయమై నిలదీయాలన్నమాట. చంద్రబాబు నిజంగానే చాలా ‘గ్రేటు’ మరి.!

ఇంకా నయ్యం.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయిందంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసమని చంద్రబాబు చెప్పలేదు. బహుశా ఆ ఐడియా ఆయనకు వచ్చి వుండదు.. ఇంకోసారి అవకాశం వస్తే ఇదే మాట ఆయన చెప్పినా చెబుతారేమో.!