ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బూతులు మానెయ్యాలి బాబూ.!

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బూతులతో విరుచుకుపడినప్పుడే కట్టడి చేసి వుంటే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇప్పుడిలా పగిలిన పార్టీ కార్యాలయంలో దీక్ష చేయాల్సిన అవసరం వచ్చి వుండేది కాదు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.. కానీ, ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తి మీద బూతులు తిడితే ఎలా.?

దాడుల్ని ఎవరూ సమర్థించరు. అదే సమయంలో, సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే చంద్రబాబు, తన పార్టీకి చెందిన నాయకుల్ని అదుపులో పెట్టుకోలేకపోవడం శోచనీయం. అప్పుడు అయ్యన్న పాత్రుడు, ఇప్పుడు పట్టాభి.. రేపు ఎవరో. ఇలాంటి దిగజారుడు రాజకీయం టీడీపీ వైపు నుంచి లేకపోతే, అధికార పార్టీ వైపు నుంచి జరిగే పొరపాట్లు హైలైట్ అవుతాయి.

ప్రజలు అన్నిటినీ గమనిస్తారు.. గమనించనుకుంటే పొరపాటే. అధికార పార్టీ డైవర్షన్ రాజకీయాలు చేసినా, ప్రతిపక్షం డైవర్షన్ రాజకీయాలు చేసినా ప్రజలు డైవర్ట్ అయ్యే ప్రసక్తే వుండదు. అందుకే, రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఓటర్లు షాకులిస్తుంటారు.

చంద్రబాబు హయాంలో పోలీసు వ్యవస్థ, అప్పటి అధికార పార్టీకి వంత పాడింది. కానీ, ప్రజలు టీడీపీ పాలనకు చరమగీతం పాడేశారు. రేప్పొద్దున్న వైసీపీ పరిస్థితి ఏమవుతుందన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. టీడీపీ కార్యాలయం మీద వైసీపీ జరిపిన దాడి, ‘కొంతవరకు సబబే’ అన్న భావన కొంతమంది జనంలో అయినా వ్యక్తమవుతోందంటే, అందుక్కారణం పట్టాభి, అయ్యన్నపాత్రుడు వాడిన భాష.

అదే సమయంలో, వైసీపీ మంత్రులు వాడుతున్న భాష మీద కూడా ప్రజలు ఓ కన్నేసి వుంచుతున్నారన్నది నిర్వివాదాంశం.

ఇక, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం.. అని ఈ రోజు ఉదయం దీక్ష ప్రారంభించిన చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ముందుగా తమ పార్టీకి చెందిన నేతలు బూతులు మాట్లాడకుండా చంద్రబాబు చూసుకోవాలి.