మనిషికి ఓటమి ఎన్నో పాఠాలను నేర్పిస్తుందట. అందుకే ఎప్పుడూ గెలవడం కాదు.. ఓసారి ఓడిపోయి చూడు.. జీవితమంటే ఏంటో తెలుస్తుంది.. ఎలా గెలవాలో తెలుస్తుంది.. అని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా అదే జరుగుతున్నట్టుంది.
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వేరు.. ప్రస్తుతం ఉన్న చంద్రబాబు వేరు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబులో చాలా మార్పు వచ్చిందట. ఈ విషయాన్ని ఎవరో కాదు.. టీడీపీ పార్టీ నేతలే చెబుతున్నారు.
అంతే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని, నేతలను నిర్లక్ష్యం చేశానని.. మళ్లీ ఆ తప్పు చేయబోనని చంద్రబాబు పార్టీ నేతలందరికీ మాటిచ్చినట్టుగా తెలుస్తోంది. వామ్మో.. చంద్రబాబులో ఇంత మార్పు వచ్చిందంటే.. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచేసినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఓటమి తర్వాత గేర్ మార్చి… ఇంకో రూట్ లో వెళ్లడం అయితే మంచి పరిణామమే అని అంటున్నారు.
పార్టీ బలోపేతంపై రివ్యూ మీటింగ్ లు, పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాల్లో చంద్రబాబు పదే పదే ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నారట. అంతే కాదు.. పార్టీ నేతలందరికీ ధైర్యాన్ని నూరిపోస్తున్నారట. పార్టీ అధికారంలో లేదని బాధపడకండి. ప్రతి కార్యకర్తకు నేను తోడుంటాను. త్వరలోనే యువతకు కూడా పార్టీలో పెద్ద పీఠ వేస్తాం. ప్రభుత్వ అసమర్థ పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.. అంటూ చంద్రబాబు ఎమోషనల్ కూడా అవుతున్నారట.
మరోవైపు పార్టీ నుంచి కొందరు నేతలు వీడిపోవడంపై కూడా చంద్రబాబు స్పందిస్తూ… ఒకరు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఒకరు పోతే.. వందమంది లీడర్లను తయారు చేసే సత్తా నాకు ఉంది అని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారట. పార్టీ కార్యకర్తలే టీడీపీకి కోట అని అన్నారట.
చంద్రబాబు ఇదే దూకుడు మీద ఉంటే… వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబులో చూడాల్సింది ఇదే ఫైర్ అని.. అది ఇప్పుడు బయటపడిందని అంటున్నారు.