ఏం ఫర్లేదు.. పుంజుకుంటాం.. చంద్రన్నమార్కు బుకాయింపు.!

chandrababu-bluff-statements-about-ap-municipal-elections

chandrababu-bluff-statements-about-ap-municipal-elections

బెదిరించారు.. భయపెట్టారు.. బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు.. అధికార పార్టీ అభ్యర్థులు తప్ప, వేరే పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేయడానికి వీల్లేని పరిస్థితులు కలిపించారు. సంక్షేమ పథకాలు తొలగిస్తామని ఓటర్లనీ బెదిరించారు.. ఇవి ఎలక్షన్స్ కాదు, సెలక్షన్స్..’ అంటోంది తెలుగుదేశం పార్టీ.

ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పంచాయితీ – మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ‘పుంజుకుంటాం.. ఇలాంటి సంక్షోభాల్ని ఎన్నో చూశాం..’ అని తనదైన స్టయిల్లో చంద్రబాబు కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి, టీడీపీకి క్యాడర్ బలం వుంది. నాయకులు వెళ్ళిపోయినా క్యాడర్ అలాగే వుంది. అయితే, ఆ క్యాడర్‌ని కూడా టీడీపీ క్రమంగా కోల్పోతూ వస్తోంది. స్థానిక ఎన్నికల్లో క్యాడర్ మరింత యాక్టివ్‌గా వుంటుంది. అయితే, ఏమయ్యిందోగానీ.. ఆ క్యాడర్‌లో ధైర్యం, ఉత్సాహం నూరిపోయడంలో పార్టీ నాయకత్వం అంత శ్రద్ధ పెట్టలేదు. ఉత్తరాంధ్ర నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడున్నారు.. రాయలసీమ తన సొంత అడ్డా.. మిగతా జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ నాయకులున్నారు. కానీ, ఎక్కడా పంచాయితీ – స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు పనిచేయాల్సినంత ఉత్సాహంగా పనిచేయలేదు. పైగా, అంతర్గత కుమ్ములాటలతో అధికార పార్టీకి అదనపు లాభం చేకూర్చారు.

డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగకుండా, ‘ఏం ఫర్లేదు.. ఆల్ ఈజ్ వెల్..’ అంటూ చంద్రబాబు ప్రవచనాలు చెప్పడం చూస్తోంటే, ఆయన నైతిక బాధ్యతను విస్మరించినట్లే కనిపిస్తోంది. ఇంకో మూడేళ్ళ తర్వాత సార్వత్రిక ఎన్నికలొస్తాయ్.. ఏదో అద్భుతం జరుగుతుంది.. అన్న ధీమా తప్ప, పార్టీని బాగు చేసుకోవాలన్న ఆలోచన చంద్రబాబులో ఏ కోశానా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలోనే పలువురు టీడీపీ ప్రజాప్రతినిథులు (ఎమ్మెల్యేలతోపాటు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా) వైసీపీ వైపు అడుగులేస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న లేటెస్ట్ అండ్ హాటెస్ట్ గాసిప్.