వైఎస్ జగన్ ఆయన్ను పార్టీలోకి తీసుకొస్తున్నారు అంటే సగం వైసీపీ హ్యాపీ సగం నాట్ హ్యాపీ 

వైఎస్ జగన్ తనని నమ్ముకుని పార్టీలోకి వచ్చినవారికి సముచిత స్థానం ఇవ్వడంలో మంచి పేరు తెచ్చుకున్నారు.  ఎన్నికలకు ముందు పదవులు ఇస్తానని ఎవరికైతే హామీలు ఇచ్చారో వారందరికీ పదవులు ఇచ్చారు.  దాదాపు అందరికీ న్యాయం చేసిన జగన్ మిగిలిన ఇంకొంతమందికి కూడా త్వరలోనే ఏదో ఒక్క పదవి ఇస్తానని చెప్పి ఉంచారు.  అందుకే వైసీపీలోకి వెళి జగన్ వద్ద మాట తీసుకుంటే పదవి తథ్యం అనే అభిప్రాయం ఏర్పడింది.  ఇది గమనించిన కొందరు లీడర్లు వైసీపీలోకి వెళ్లే సన్నాహాల్లో ఉన్నారట.  వారిలో చలమలశెట్టి సునీల్ కూడా ఉన్నారని టాక్.  
 
చలమలశెట్టికి రాజకీయంగా అంత పలుకుబడి లేకపోయినా పారిశ్రామికవేత్తగా మంచి పేరుంది.  వ్యాపారాల్లో బాగానే గడించారాయన.  రాజకీయంగా ఎదగాలనే కోరిక కూడా ఆయనలో బలంగా ఉంది.  అందుకే 2009లో చిరు ప్రజారాజ్యం పెట్టగానే అందులో చేరి కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడారు.  ఆ తర్వాత 2014లో వైసీపీ తరపున పోటీకి దిగి ఓడారు.  అటుపిమ్మట టీడీపీలో చేరి 2019లో బరిలో నిలిచి మళ్లీ ఓడారు.  ఇలా వెళ్లిన ప్రతిచోటా టికెట్ అయితే సాధించారు కానీ ఎంపీగా గెకవలేకపోయారు.  అందుకే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా పరోక్షంగా పార్లమెంట్ మెట్లు ఎక్కాలని సునీల్ భావిస్తున్నారట. 
 
అందుకే వైసీపీలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారట.  ఈమేరకు జగన్ వద్ద నుండి ఆయనకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని, త్వరలోనే పార్టీలో చేరిపోతారని టాక్.  అయితే సునీల్ తిరిగి పార్టీలోకి రావడం పట్ల భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయట.  కొందరేమో సునీల్ ఎలాగూ ఇబ్బందికర రాజకీయాలు చేసే ఉద్దేశ్యం ఉన్న వ్యక్తి కాదు కాబట్టి ఆయన పార్టీలోకి వచ్చి ఏదైనా నామినేటెడ్ పదవి పొందినా పెద్దగా ఇబ్బంది ఉండదని, పైగా సునీల్ లాంటి విజయవంతమైన పారిశ్రామికవేత్త పార్టీలో ఉండటం మంచిదేనని అంటుండగా కేవలం పదవి పొందాలనే కాంక్షతో పార్టీలు మారే వ్యక్తిని రెండోసారి పార్టీలోకి తీసుకుంటే మరోసారి బయటకి వెళ్లరనే నమ్మకం ఏమిటని, అయినా ఇంకా పదవులు తీసుకోవాల్సినవారు పార్టీలో మిగిలే ఉండగా కొత్త వాళ్లు చేరితే పోటీ ఏర్పడుతుందని ఇంకొందరు అంటున్నారట.