రూ. 2000 నోటు బంద్ .. అసలు విషయం చెప్పిన కేంద్రం !

మోడీ సర్కార్ కేంద్రంలో కొలువు దీరిన తర్వాత ఇప్పటివరకు తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో పెద్ద నోట్ల రద్దు కూడా ఒకటి. ఆ తర్వాత 2000 రూపాయల నోటు ను కేంద్రం తీసుకువచ్చింది. కానీ, ఆ 2000 రూపాయల నోటుని ప్రభుత్వం రద్దు చేయబోతుంది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. రూ. 2000 నోటును ఆర్‌బీఐ బ్యాంకులకు సరఫరా చేయడం పూర్తిగా నిలిపేసిందన్నది ఆ వార్త .

ఈ కారణంగానే చాలా బ్యాంకు ఏటీఎంలలో కేవలం వంద, రెండు, ఐదు వందల రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయని , సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు తమ ఏటీఎంలలో రూ. 2000 నోటును అమర్చే విధానానికి కూడా స్వస్తి చెప్పాయని వార్తల్లో ప్రచారం అవుతుంది. దీంతో చాలామంది ఈ వార్తలు చూసి కొంచెం ఆందోళన చెందుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తరహాలోనే, కేంద్రం మరోసారి రూ. 2000 నోటును రద్దు చేయనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ఈ వార్తపై కేంద్రం వివరణ ఇచ్చింది. బ్యాంకులకు ఆర్‌బీఐ రూ. 2000 నోటు సరఫరా నిలిపి వేయలేదని వివరించింది. సోషల్ మీడియా లో వచ్చే వార్తల్లో అసలు వాస్తవం లేదని తేల్చి చెప్పింది. గత కొన్ని రోజుల క్రితం రూ. 2000 నోటు సరఫరా నిలిపేశాయనే వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా స్పందించారు. అసలు తాము బ్యాంకులకు అలాంటి ఆదేశాలు ఏవీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎప్పటిలాగే రూ.2,000 నోట్లు చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయని, పెద్ద నోట్ల విషయంలో పుకార్లు నమ్మొద్దని స్ఫష్టం చేశారు.