విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించిన కేంద్రం.!

ఓ అంశం మీద ఇచ్చిన వివరణ ఇంకో అంశానికి సంబంధించి స్పష్టత వస్తే.. అది అధికార పార్టీకి కొండంత బలాన్నిస్తే.. అది వెరీ వెరీ స్పెషల్ కదా.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రో ధరల మంట.. అంటూ గత కొంత కాలంగా జరుగుతున్న యాగీ అంతా ఇంతా కాదు. అందులో నిజమూ లేకపోలేదు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రో ధరలు చాలా ఎక్కువ. రాష్ట్రం బాదుడు ఓ వైపు, కేంద్రం బాదుడు ఇంకో వైపు.. వెరసి పెట్రో బాదుడుతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. పెట్రో ధరల విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడమేకాదు, కేంద్రాన్నీ నిలదీయాల్సిన బాధ్యత విపక్షాలపై వుంది. చిత్రంగా, విపక్షాలు.. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తాయి. పెట్రో ధరల విషయమై కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నుల వివరాల్ని పేర్కొంటూ కేంద్రం ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పరోక్షంగా ఊరటనిచ్చింది.

అందులో విశాఖను రాష్ట్ర రాజధానిగా పేర్కొనడమే అందుక్కారణం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల్ని ప్రతిపాదించింది. అందులో ఒకటి ప్రస్తుత రాజధాని అమరావతి కాగా, మరో రెండు.. విశాఖపట్నం, కర్నూలు. అమరావతిని చంద్రబాబు హయాంలో రాజధానిగా నిర్ణయించారు. దాన్ని శాసన రాజధానిగా మార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా ఇచ్చింది. కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ అవుతోంది. కానీ, మూడు రాజధానుల అంశం ఇంకా కోర్టు పరిధిలోనే వుంది. మూడు రాజధానులపై హైకోర్టు ‘స్టేటస్ కో’ కొనసాగుతోంది. మరెలా కేంద్రం, విశాఖను రాజధానిగా గుర్తించిందట.? ‘క్యాపిటల్’ కేటగిరీలో వివిధ రాష్ట్రాలకు చెందిన రాజధానుల్ని ప్రస్తావించిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పక్కన రాజధానిగా విశాఖకు హోదా కలిగించింది. ఇది సాంకేతిక సమస్య కారణంగా జరిగిన పొరపాటు అనుకోవాలా.? లేదంటే, కేంద్రం పూర్తి సోయతోనే విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేర్కొందా.? అన్నది తేలాల్సి వుంది.