ఏపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్ ఇద్దరూ తాము అమరావతికే కట్టుబడి ఉన్నామని, రైతుల పక్షాన నిలబడి పోరాడతామని అన్నారు. పవన్ కళ్యాణ్ అమరావతిపై చిత్తశుద్ది ఉంటే క్రిష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సైతం అసెంబ్లీని రద్దు చేసి మూడు రాజధానుల విధానంతో ఎన్నికల్లో తలపడాలని ఛాలెంజ్ విసిరారు. అధికార పక్షం మాత్రం చిత్తశుద్ధి నిరూపించుకోవలసింది అమరావతి సెంటిమెంట్ ఉన్నవారని కౌంటర్ ఇచ్చారు. దీంతో ఒక్క రాజీనామా జరగలేదు. ఇలా అధికార పక్షాన్ని ఆపాలని రకరకాల మార్గాలు వెతుకుతున్నారు.
ఆ వెతుకులాటలో కొందరు కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. రాజధాని కేంద్రం పరిధిలోని అంశమని కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని నిలుచరించాలని డిమాండ్ చేశారు. తాను శంఖుస్థాపన చేసిన రాజధానిని తానే కాపాడుకోవాలని మోడీని కోరుతున్నారు. ఈమేరకు హైకోర్టులో కేంద్రం జోక్యాన్ని డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం స్పందించింది. తన స్పందనలో రాజధానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. రాజధాని ఎంపిక అనేది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని, తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.
గతంలో రాష్ట్ర విభజన సమయంలో కూడా రాజధాని ఎంపికకు తాము శివరామక్రిష్ణనన్ కమిటీని ఏర్పాటు చేశామని, అదే అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని పేర్కొన్నారు. అంతేకాదు తాజాగా మూడు రాజధానుల మీద ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ విషయంలో కూడా తమ పాత్ర లేదని అంటూ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, ప్యాకేజీ నిధులు విడుదల చేస్తామని అంది. ఈ మాటలతో మూడు రాజధానులను కేంద్రం అడ్డుకోవాలని డిమాండ్ చేసేవారికి, కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపుతామని అంటున్న చాలామందికి తీవ్ర నిరాశే అనుకోవాలి. మరి జగన్ ను ఆపడానికి సహకరిస్తుందనుకున్న కేంద్రం కూడా మా చేతుల్లో ఏమీ లేదన్న ఈ తరుణంలో మూడు రాజధానుల వ్యతిరేకులు ఏం చేస్తారో చూడాలి.