బెంగాల్లో హింసపై కేంద్రం సీరియస్..! మమత మళ్లీ స్వరం పెంచేనా..?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది దశల్లో నిర్వహిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పుడు సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. మోదీ చెప్తేనే ఎనిమిది దశల్లో నిర్వహిస్తున్నారా..? అని ధ్వజమెత్తారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సింది పోయి ఒకరి మాటలను పాటిస్తారా? అని ప్రశ్నించారు. గతం నుంచీ బీజేపీతో ఉన్న వైరం కాస్తా.. మోదీ-షా మీదకు వెళ్లింది. ఎన్నికల ప్రచారం, ఎన్నికలు.. చివరికి ఫలితాల సమయంలో కూడా మమత వర్సెస్ మోదీ అన్నట్టే పరిస్థితులు నడిచాయి. మొత్తానికి దీదీ ముందు మోదీ-షా ఆటలు సాగలేదు. ఆమె ఓడిపోయిన స్థానంలో కూడా కేంద్రం కుట్ర పన్నిందనే ఆరోపణే చేశారు. ఇలా.. మమత వర్సెస్ మోదీ యుద్ధం ముగిసింది అనుకుంటే మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తున్నాయి.

బెంగాల్ ఎన్నికల నాలుగో దశలో మమత బెనర్జీ పోటీ చేస్తున్న నందీగ్రామ్ లో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఆరుగురు చనిపోయారు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఇందుకు మీరే కారణమని ఒకరిపై మరొకరు నెపం వేసుకున్నారు. ఫలితాల అనంతరం జరిగిన ఘర్షణల్లో 12 మంది మృతి చెందారు. నిన్న.. మత సీఎం అయిన తర్వాత బెంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈరోజు బెంగాల్ లో కేంద్ర మంత్రి వి.మురళీధరన్ కాన్వాయ్ పై దాడి జరిగింది. దాడిలో మంత్రి వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. వెస్ట్ మిడ్నాపూర్‌లో ఈ ఘటన జరిగింది. దీంతో బెంగాల్లో అహింసా వాతావరణం పెరిగిపోయిందని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

జరిగిన అల్లర్లన్నీ బీజేపీ గెలిచిన చోటే అని సీఎం మమత బెనర్జీ అన్నారు. దీంతో కేంద్ర హోంశాఖ స్పందించింది. అత్యవసర విచారణ నిమిత్తం హోంశాఖ అదనపు కార్యదర్శిని పింపింది. ఘటనలకు కారణాలపై నివేదిక పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ.. దీనిపై స్పందన లేకపోవడంతో సీరియస్ అవుతోంది కేంద్రం. అయితే.. సీఎం మాత్రం ఇది రాష్ట్రంపై కేంద్రం పెత్తనం చెలాయించడమే అని మండిపడుతున్నారు. దీంతో ఈ విషయంపై జాతీయస్థాయిలో రచ్చ జరిగేట్టు ఉందని పరిశీలకులు అంటున్నారు. రాజకీయ వైరం వెరసి.. పరిస్థితుల నేపథ్యంలో మరి సీఎం ఎలా స్పందిస్తారో.. కేంద్రం ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.