ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి ద్వంద వైఖరిని అవలంభిస్తున్న సంగతి విధితమే. స్పెషల్ స్టేటస్ నుండి ఈరోజు నడుస్తున్న మూడు రాజధానుల వరకు బీజేపీ సర్కార్ కర్ర విరగదు, పాము చావదు అనే రీతిలో మాట్లాడుతూ వస్తోంది. ఈ డబుల్ స్టాండర్డ్ వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే.. అదే అటు రాజకీయ పార్టీలను, ఇటు ప్రజలను మేనేజ్ చేయడం. రాష్ట్ర రాజధాని విషయంలో కలుగజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు, రాజకీయ పార్టీలు కోరుతూ వచ్చాయి. కేంద్రానికి కలుగజేసుకునే అవకాశాలు కూడ ఉన్నాయని విశ్లేషకులు చెబుతూ వచ్చారు. కానీ అనూహ్యంగా మోదీ సర్కార్ రాష్ట్ర రాజధానుల విషయంలో తమ జోక్యం ఉండదని, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కోర్టులో సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. దీంతో ఇక జగన్ సర్కారుకు అడ్డు ఉండదని అందరూ అనుకున్నారు.
తాజాగా నిన్న సమర్పించిన అఫిడవిట్లో సైతం విభజన చట్టంలో ‘ఏ క్యాపిటల్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనే మాటకు అర్థం రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని ఉండాలని కాదని, ఎన్ని రాజధానులు ఉండాలి, అవి ఎక్కడెక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేసింది. అంటే జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, తమ బాధ్యతగా మూడు రాజధానుల అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తామని అర్థం. కానీ ఇంతటి బీజేపీ ప్రభుత్వం మాటలు ముగియలేదు. పలు అర్థాలు ధ్వనించేలా ఇంకో మాట కూడ అన్నారు. రైతులు హైకోర్టు అమరావతిలో ఉంది కాబట్టి అమరావతినే రాజధాని నగరంగా పరిగణించాలని డిమాండ్ చేశారు.
దీని గురించి ప్రస్తావించిన కేంద్ర హోం శాఖ హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉన్నంత మాత్రాన ఆ నగరాన్ని రాజధానిగా అనుకోవడానికి లేదని వ్యాఖ్యానించింది. ఈ మాటలు అమరావతి రైతులను నిరుత్సాహపరిచేవే. అలాగే ఇంకోక వర్గం కూడ ఈ వ్యాఖ్యానాలు విని అయోమయంలో పడింది. అదే.. కర్నూలు జిల్లాలో హైకోర్టు వస్తుంది, అది న్యాయ రాజధాని అవుతుంది అని ఆశపడుతున్న వర్గం. జగన్ మూడు రాజధానులతో కర్నూలు జిల్లాకు హైకోర్టు ఇచ్చి దశాబ్దాల నాటి వారి రాయలసీమవాసుల రాజధాని హోదా కలను తీరుస్తామని అన్నారు. ఈ చర్యతో సీమలో మరింత బలపడవచ్చని భావించారు. కానీ ఇప్పుడు కేంద్రం మాటాలతో మనకు హైకోర్టు వచ్చినంత మాత్రాన మన జిల్లా రాజధాని అయిపోదన్నమాట అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు వచ్చినంత మాత్రాన జిల్లా అభివృద్ధి చెందదు అనే మాటలకు ఈ సందేహం తోడై అనుమానాలు మరింత బలఒడితే జగన్ సీమ ఆశలకు గండిపడ్డట్టే అంటున్నారు విశ్లేషకులు.