Central Budget : కేంద్ర బడ్జెట్ మంచిదేగానీ, చెడ్డది: విజయసాయిరెడ్డి.!

Central Budget : ఇటీవల కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్టుని ‘చెత్త బడ్జెట్’గా అభివర్ణించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్నట్లు, ఈ బడ్జెట్ దేశానికి మేలు చేస్తుందేమోగానీ, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఇది బ్యాడ్ మరియు వరస్ట్ బడ్జెట్.. అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.

వైసీపీ నుంచి బడ్జెట్టుపై ఇంతటి తీవ్రమైన వ్యాఖ్య ఇటీవలి కాలంలో రాలేదన్నది నిర్వివాదాంశం. అయితే, ఇక్కడా చాలా డిప్లమాటిక్ యాంగిల్‌లో విజయసాయిరెడ్డి, కేంద్ర బడ్జెట్టుపై విమర్శలు గుప్పించడం గమనార్హం. కర్ర విరగకూడదు, పాము చావకూడదు.. అన్నట్టు కనిపిస్తోంది విజయసాయిరెడ్డి వ్యవహారశైలి.

నిజానికి, కేంద్ర బడ్జెట్టుపై వైసీపీ ఎంపీలు పార్లమెంటు సాక్షిగా నిరసనలు తెలపాల్సి వుంది. ప్రత్యేక హోదా సహా పోలవరం, మరికొన్ని కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీయాల్సిన వైసీనీ, ఆ స్థాయిలో నిరసన కార్యక్రమాలేవీ చేపట్టడంలేదు. టీడీపీ గురించి ఈ విషయమై ఎంత మాట్లాడుకున్నా దండగే.

గతంలో కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకింగి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధైర్యంగా నిలబడ్డారు.. మరి, ఆ ధైర్యం ఇప్పుడెందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రదర్శించడంలేదు.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. గతంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరాహార దీక్ష కూడా చేశారు. అప్పుడూ ప్రధానిగా నరేంద్ర మోడీనే వున్నారు. ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదాపై ‘అడుగుతూనే వుంటాం..’ అంటూ తేలిక వ్యాఖ్యలు చేస్తున్నారు వైఎస్ జగన్.

ఏదిఏమైనా, రాష్ట్ర ప్రయోజనాల విషయమై సుతిమెత్తగా కేంద్రాన్ని ప్రశ్నిస్తే సరిపోదు.. కేంద్రాన్ని నిలదీయాలన్న ఎజెండాతో అధికార వైసీపీ ముందడుగు వేస్తే మంచిదేమో.!