ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతాపార్టీ వైఖరికి విరుద్దంగా మూడు రాజధానుల బిల్లు అంశంపై గవర్నర్ కి లేఖ రాయడంపై అదిష్టానం సీరియస్ అయింది. ఏపీ సర్కార్ గవర్నర్ కు పంపిన రెండు బిల్లుల అంశంపై కన్నా రాసిన లేఖ బీజేపీ వైఖరికి విరుద్దంగా ఉందని కేంద్ర నాయకత్వం అభిప్రాయపడింది. కేంద్రంలో ఎవరినీ సంప్రదించకుండా రాసిన లేఖపై కన్నాను గట్టిగా మందలించినట్లు తెలిసింది. తెలుగు దేశం పార్టీ వైఖరిని తలపించేలా…ఆ పార్టీకి కొమ్ము కాసేలా ఉందని ఢిల్లీ పెద్దలు మండిపడ్డారు. పార్టీ విధానం మొదటి నుంచి ఒకటేనని, ఆ ప్రకారం రాజధాని అంశం పూర్తిగా రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోని అంశమేనని కేంద్రం మరోసారి పునరుద్ఘాటించింది.
అమరావతిలో రాజధానికోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలన్నదే బీజేపీ విధానమని స్పష్టం చేసింది. కానీ కన్నా లేఖలో పూర్తిగా టీడీపీ వైఖరి ని సమర్ధించినట్లు గా ఉందని, ఫలితంగా బీజేపీ గత ప్రకటనలకు భిన్నమైన వైఖరిని ప్రదర్శించినట్లు అయిందని కేంద్ర నాయకత్వం భావించింది. ఈ విషయంలో గవర్నర్ కి సైతం వివరణ ఇచ్చే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. కన్నా రాసిన లేఖను బీజేపీ వైఖరిగా పరిగణించ వద్దని గవర్నర్ కి ముందుగా లేఖ రూపంలో తెలియజేయ నున్నట్లు సమాచారం. పార్టీని ఇరకాటంలోనూ, ఇబ్బందుల్లోనూ పెట్టే తరహాలో లేఖలు రాయోద్దని కన్నాను హెచ్చరించింది.
అలాగే ఈ లేఖపై కన్నాని వెంటనే వివరణ ఇవ్వాలని అదిష్టానం ఆదేశించినట్లు సమాచారం. కన్నా వైఖరిని ఏడాది కాలంగా చూస్తున్నామని ఏపీ విషయంలో కేంద్రం ఒక మాట చెబుతుంటే..కన్నా అందుకు భిన్నంగా వ్యవహరి స్తున్నారని మండపడింది. తాజా పరిస్థితులను బట్టి చూస్తుంటే! మొన్నటివరకూ చూసి చూడనట్లు వదిలేసిన కన్నాని ఇప్పుడు కేంద్రం గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. బిల్లుల విషయంలోనే అదిష్టానం అనుమతి లేకుండా గవర్నర్ కే ఫిర్యాదులు చేసే వరకూ చేరడంతో ఆయనపై వేటు వేస్తేనే మంచిదని పెద్దలు భావిస్తున్నారుట. మొత్తానికి కన్నా ఓవర్ యాక్షన్ రివర్స్ అయినట్లే ఉంది.