కాంగ్రెస్ పార్టీతో చెట్టాపట్టాల్ వైపుగా టీడీపీ అధినేత చంద్రబాబు.?

టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ రెండు మూడు వ్యూహాలతో రాజకీయాల్లో ముందడుగు వేస్తుంటారు. అందుకేనేమో, ఈ మధ్యకాలంలో ఆయన వ్యూహాలు అత్యంత దారుణంగా బెడిసి కొడుతున్నాయి. ఒకప్పటి చంద్రబాబు చాణక్యం వేరు.. ఇప్పుడు ఆయన రాజకీయం వేరు. 2014 ఎన్నికల్లో బీజేపీతో అంటకాగిన టీడీపీ, 2018లో బీజేపీతో తెగతెంపులు చేసేసుకుంది. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన సంగతి తెలిసిందే. తిరిగి, 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి కూడా దూరమయ్యారు చంద్రబాబు. అయితే, మారిన, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం మేలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారనే ప్రచారం జరుగుతోంది.

బీజేపీ వ్యతిరేక కూటమిలోకి చేరాలనే తపనతో వున్న చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సాయంతో, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మద్దతు కోరుతున్నారట. గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ మీద చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం విదితమే. ప్రశాంత్ కిషోర్, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. కాగా, ప్రశాంత్ కిషోర్.. ఇటు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితోనూ, అటు ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ మంతనాలు జరుపుతున్నారు, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేయడం కోసం. అయితే వైసీపీ – ప్రశాంత్ కిషోర్ మధ్య బంధం తెంచేందుకు చంద్రబాబు అండ్ టీమ్ విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నాయట. కాంగ్రెస్ నుంచి కూడా చంద్రబాబు ప్రతిపాదనలకు కొంత మద్దతు లభిస్తోందట. అన్నీ కుదిరితే అతి త్వరలోనే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో వివిధ పార్టీల పెద్దల సమావేశంలో చంద్రబాబు కూడా పాల్గొనే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.