CBN Dattaputrudu : తెలుగునాట రాజకీయాల్లో ఇప్పుడు దత్తపుత్రుడెవరన్న విషయమై అధికార వైసీపీ, అలాగే జనసేన పార్టీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ‘చంద్రబాబు దత్త పుత్రుడు’ అంటోంది వైసీపీ.
దానికి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు తాజాగా జనసేన అధినేత.
‘మమ్మల్ని ఇంకోసారి సీబీఎన్ దత్తపుత్రుడని విమర్శిస్తే, మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడని అనాల్సి వస్తుంది..’ అంటూ పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు, ‘టీడీపీకి జనసేన బీ-టీమ్’ అని వైసీపీ విమర్శలు చేయడాన్నీ తప్పు పట్టారు పవన్. ‘మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీమ్’ అని పిలవాల్సి వస్తుందని హెచ్చరించారు.
సో, ఇక్కడితో వైసీపీ.. జనసేన మీద విమర్శలు చేయడం మానుతుందా.? ఛాన్సే లేదు. తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నట్టు తయారైంది వ్యవహారం. ‘చంద్రబాబు దత్త పుత్రుడు’ అనే విమర్శ కంటే, ‘సీబీఐ దత్త పుత్రుడు’ అనే విమర్శ చాలా ఘాటైనది. అంతేనా, ‘చర్లపల్లి జైలు షటిల్ టీమ్’ అనేది ఇంకా దారుణమైన విమర్శ.
తప్పదు, పవన్ మీద వైసీపీ విమర్శలు చేశాక, వైఎస్ జగన్ మీద పవన్ విమర్శల్నీ వైసీపీ తట్టుకోవాల్సి వుంటుంది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి పదే పదే వైసీపీ విమర్శిస్తున్న దరిమిలా, వైసీపీ మీద కూడా అదే తరహా కౌంటర్ ఎటాక్ జనసేన నుంచి వచ్చే అవకాశాలూ లేకపోలేదు.
అవసరమా ఇదంతా.? అంటే, అవసరమే.! ఇప్పుడున్న రాజకీయాలే అలా తగలడ్డాయ్.