గత కొన్ని రోజుల నుంచి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన సొంత పార్టీ మీదనే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రెబల్ గా మారి.. తన పార్టీ నేతలపై, ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆయనకు తాజాగా షాక్ తగిలింది అని తెలుస్తోంది.
ఎంపీ ఇంట్లో సీబీఐ దాడులు చేస్తున్నట్టుగా సమాచారం అందింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల ప్రత్యేక బృందం హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
ఇందు భారత్ కంపెనీతో పాటు మరో ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ సీబీఐ సోదాలు చేస్తుంది. ఉదయం ఆరు గంటల నుంచి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రఘురామకృష్ణంరాజుకు ఉన్న ఇళ్లలో సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే… 2019 ఎన్నికల కంటే ముందు కృష్ణంరాజుపై బ్యాంక్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి సీబీఐ దాడులు జరిగాయి. బ్యాంకుల నుంచి రుణం తీసుకోని సకాలంలో వాటిని చెల్లించకపోవడంతో… అప్పట్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. బ్యాంకులకు రుణాల ఎగవేత కేసును ఆయన మీద నమోదు చేశారు.
తాజాగా మరోసారి ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. రఘురామకృష్ణంరాజు తన నివాసంలో ఎటువంటి సీబీఐ సోదాలు జరగడం లేదని ప్రకటించారు. ఇదంతా కావాలని ఎవరో చేస్తున్న కుట్ర అని.. తన ఇంట్లో ఎటువంటి రైడ్స్ జరగడం లేదంటూ తేల్చి చెప్పారు. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆయన ఇంట్లో సీబీఐ రైడ్స్ జరుగుతున్నాయంటూ రిపోర్ట్ చేస్తున్నాయి.