వివేకా హత్యపై సమాచారమిస్తే ఐదు లక్షలట.. మరీ ఎక్కువేమో.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సరైన సమాచారం అందిస్తే 5 లక్షలు నజరానా ఇస్తామని సీబీఐ ప్రకటించింది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి కాగా, అప్పటినుంచీ ఇప్పటిదాకా ఈ కేసులో దోషులెవరన్నది తేలలేదు. సిట్ విచారణలు జరిగాయి, సీబీఐ రంగంలోకి దిగింది.. కానీ, వైఎస్ వివేకా కుటుంబానికి న్యాయం జరగకపోవడం అత్యంత బాధాకరం. కాగా, తగిన సమాచారమిస్తే 5 లక్షలంటూ సీబీఐ చేసిన ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుల్లో ‘సుపారీ హత్యల’ కోసం లక్షలు కాదు, కోట్లు ఖర్చు చేసేస్తున్నారు. సమాచారమిస్తే, తగిన భద్రత కల్పిస్తామనీ, వారి పేర్లను గోప్యంగా వుంచుతామనీ సీబీఐ చెబుతున్నా.. ఇలాంటి కేసుల్లో సమాచారమిచ్చేవారి భద్రతపై చాలా అనుమానాలున్నాయి.

5 లక్షలకు కక్కుర్తిపడి ఎవరు మాత్రం తమ ప్రాణాల్ని పణంగా పెట్టి, సమాచారమిస్తారు.? అన్న చర్చ కూడా జరుగుతోంది. ‘5 లక్షలు చాలా చాలా తక్కువ..’ అన్న వాదన ప్రముఖంగా వినిపిస్తోంటే, సీబీఐ తరఫున ఇది చాలా పెద్ద మొత్తం ఇలాంటి కేసుల్లో అన్నది ఇంకో వాదన. ఎన్నికల సమయంలో జరిగిన హత్య.. రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఈ హత్యకు సంబంధించి చాలా రాజకీయ విమర్శలు కనిపించాయి. పత్రికల్లో పెద్దయెత్తున కథనాలొచ్చాయి.. ఆయా రాజకీయ నాయకుల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ, వాటి ఆధారంగా ఎన్నికల్లో ‘ఓటు’ అటూ ఇటూ మారిన మాట కూడా వాస్తవం. ఇంతటి కీలకమైన కేసు విషయంలో ఇన్నాళ్ళపాటు సీబీఐ ఏమీ తేల్చలేకపోవడంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జనంలో. కొందరి అరెస్టులు, ఇంకొందరి విచారణలు.. ఇలా ఇంత కథ నడిచాక, ఇప్పుడు ‘సరైన సమాచారం’ కోసం సీబీఐ ప్రకటన విడుదల చేయడం ఆశ్చర్యకరమే మరి.