వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించిందన్న ఆరోపణలున్నాయి. స్వయానా రఘురామ, ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళారు. తన తండ్రిపై జరిగిన దాడికి సంబంధించి సీబీఐతో విచారణ చేయించాలంటూ రఘురామ తనయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో తదుపరి ఏం జరగబోతోంది.? సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే, ఆ విచారణలో ఏం తేలబోతోంది.? సరే, ఏం తేలుతుందన్నది వేరే చర్చ.. అసలు ఎప్పటికి విషయం తేలుతుంది.? అన్నదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్న.
రాష్ట్రానికి సంబంధించి సీబీఐ పలు కేసుల్ని టేకప్ చేసింది. అందులో వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఒకటి. మరో కీలకమైన కేసు డాక్టర్ సుధాకర్ వ్యవహారానికి సంబంధించినది. డాక్టర్ సుధాకర్ ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. ఆ కేసు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. కర్నూలు జిల్లాకి చెందిన బాలిక సుగాలి ప్రీతిపై హత్యాచారానికి సంబంధించి కూడా సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతర్వేది రధం దగ్ధం ఘటన కూడా సీబీఐకి వెళ్ళింది. అంతర్వేది ఘటన, సుగాలి ప్రీతి వ్యవహారంపై సీబీఐ ఇంకా స్పందించలేదు. వివేకా, సుధాకర్ వ్యవహారాలపై హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ ప్రారంభమయ్యింది. మామూలుగా సీబీఐ విచారణ అంటే శరవేగంగా జరుగుతుంటుంది. ఇక్కడేంటో, సీబీఐ విచారణ అంటే నత్తనడకన సాగుతోంది. ఈ లెక్కన రఘురామ కేసు ఒకవేళ సీబీఐ చేతికి వెళ్ళినా, విచారణ వేగంగా జరుగుతుందని ఆశించగలమా.? అన్న చర్చ సామాన్యుల్లో జరుగుతోంది. సీబీఐ పట్ల జనంలో ఇంత పలచన భావం ఎందుకు ఏర్పడింది.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నేమీ కాదు. ఆయా కేసుల్లో జాప్యమే ఈ భావనకు కారణం.