సీబీఐ అనేది ఇండిపెండెంట్ సంస్థ. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే.. ఆ ప్రభుత్వానికి సీబీఐ వత్తాసు పలకకూడదు. ఏ ప్రభుత్వానికీ ఫేవర్ గా ఉండకూడదు. అలా అయితేనే ఏ దర్యాప్తు అయినా పారదర్శకంగా సాగుతుంది. కానీ.. నేడు మాత్రం సీబీఐ బీజేపీ అనుబంధ సంస్థగా మారిపోయింది అనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా అదే ఆరోపిస్తున్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓకే కానీ.. బీజేపీ పాలించని రాష్ట్రాల్లో అంటే బీజేపీ కాకుండా వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తు అంటేనే ఆరాష్ట్రాలకు టెన్షన్ వచ్చేస్తోంది. ఎందుకంటే.. సీబీఐ అసలే బీజేపీ చెప్పిన మాట వింటుంది. కేంద్రానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం నచ్చకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సీబీఐని ఉసిగల్పితే లేనిపోని సమస్యలు వచ్చినట్టే కదా. అందుకే.. బీజేపీ కాకుండా… బీజేపీయేతర రాష్ట్రాల్లో సీబీఐ జనరల్ కన్సెంట్ ను రద్దు చేస్తున్నాయి. తాజాగా కేరళ సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను రద్దు చేసింది.
నిజానికి సౌత్ ఇండియా మొత్తం పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. నార్త్, వెస్ట్ లో పర్లేదు కానీ.. సౌత్ లోనే బీజేపీకి బలం లేదు. ఒక్క కర్ణాటక మినహా.. ఇతర సౌత్ ఇండియా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా పట్టు సాధించాలని తహతహలాడుతోంది బీజేపీ.
తాజాగా కేరళను టార్గెట్ చేసింది బీజేపీ. అక్కడ అధికారంలో ఉన్న లెఫ్ట్ పార్టీ నేతలపై రకరకాల ఆరోపణలు చేస్తన్నారు. కేరళలో లెఫ్ట్ నేతలపై సీబీఐ ఎంక్వయిరీ వేయించి కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. అందుకే కేరళ సీబీఐ జనరల్ కన్సెంట్ నే రద్దు చేసేసింది.
సౌత్ మాత్రమే కాదు.. వెస్ట్ లోని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవలే సీబీఐ జనరల్ కన్సెంట్ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు కూడా సీబీఐకి నో చెప్పాయి.
ఏపీలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జనరల్ కన్సెంట్ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత సీఎం జగన్ జనరల్ కన్సెంట్ ను మళ్లీ పునరుద్ధరించారు.
అయితే.. అన్ని బీజేపీయేతర రాష్ట్రాలు సీబీఐకి నో ఎంట్రీ బోర్డులు పెట్టేస్తే.. సీబీఐని ఇక నమ్మేదెవరు. సీబీఐ దర్యాప్తును కోరేదెవరు. ఒకప్పుడు సీబీఐ అంటే ఎలా ఉండేది. కానీ.. సీబీఐ ప్రస్తుతం ఇలా తయారవడంతో… జనరల్ కన్సెంట్ ను రద్దు చేస్తుండటంతో దాని విశ్వసనీయతపై అనుమానం కలగక మానదు.