డాక్టర్ సుధాకర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు సీబీఐ చేతికి వెళ్లడంతో డొంకంతా కదులుతున్నట్లే కనిపిస్తోంది. తొలుత హైకోర్టు తీర్పు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇప్పుడు..అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేసింది. వ్యవహారం నర్సీపట్నం నుంచి రాజధాని వరకూ అంతా అంటుకుంది. ఇప్పటికే సుధాకర్ పై చేయి చేసుకున్న పోలీసులు…వైద్యం చేస్తోన్న డాక్టర్లు…సిబ్బందిని సీబీఐ అధికారులు విచారించారు. అయితే తాజాగా సుధాకర్ పైనే సీబీఐ ఉల్లంఘనల కేసు నమోదు చేయడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది! అన్న ఆసక్తి నెలకోంది.
ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప‌్రభుత్వంపై విమర్శలు చేయడంపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సుధాకర్ ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేసారా? లేక ఆయన వెనుక రాజకీయా పార్టీలేమైనా ఉన్నాయా? అన్న కోణం లో సీబీఐ దర్యాప్తు చేయనుంది. అయితే సుధాకర్ తన కుమారుడ్ని అరెస్ట్ చేయడంతో ఉద్దేశ పూర్వకంగా విమర్శించారని కొంత మంది ఆరోపించారు. కుమారుడుని అరెస్ట్ చేయడం తట్టుకోలేక బహిరంగంగా నోరుజారారని వినిపించింది. అలాగే సుధాకర్ వెనుక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉన్నారని..ఆయన వెనుకుండే సుధాకర్ ని ముందుకు నడిపించారని వైకాపా నేతలు ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు సహకారం లేకపోయి ఉంటే ఈ కేసు ఇంత వరకూ వచ్చేది కాదని…చాలా చిన్న విషయాన్ని చంద్రబాబు రాజకీయం చేయాలని చూసినట్లు పెద్ద ఎత్తున వైకాపా నేతలు ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. సీబీఐ లోతైన విచారణ చేపడితే అసలు ఈ కథకు పునాది ఎలా పడింది? తప్పు సుధాకర్ దా? లేక అతని పట్ల అమానుషుంగా ప్రవర్తించిన ప్రభుత్వ అధికారులదా? అన్నది నిగ్గు తేలాల్సి ఉంది. ఇప్పటికే సుధాకర్ విషయంలో హైకోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిచ్చి…ఏపీ పోలీసులు తీరుపై మండిపడిన సంగతి తెలిసిందే.