జడ్జిలపై విద్వేషం: కొనసాగుతున్న సీబీఐ అరెస్టుల పర్వం.!

న్యాయస్థానాల్లో వచ్చే తీర్పుల్ని సవాల్ చేసుకోవడానికి ఎప్పుడూ అవకాశం వుంటుంది. అలాంటప్పుడు న్యాయస్థానాలపైనా, న్యాయమూర్తులపైనా వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు.? కానీ, ఇప్పుడున్న రాజకీయాల్లో కాదేదీ విమర్శకు అనర్హం అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా.. ఇవి ఎవరైనా ఎలాగైనా విమర్శించడానికి వేదికలవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పదే పదే న్యాయస్థానాల్లో చుక్కెదురవుతుండడంపై అధికార పార్టీ నేతలే కొందరు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కీలక పదవుల్లో వున్నవారు సైతం తమ అసహనాన్ని దాచుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు, అధికార పార్టీ అభిమానులు హద్దులు దాటి వివాదాస్పద వ్యాఖ్యల్ని న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై చేయడం చూస్తున్నాం.

తెలంగాణలోనో, ఇంకో రాష్ట్రంలోనో ఇలాంటి పరిస్థితి కనిపించడంలేదు. అన్నట్టు, ఓ కేసులో తీర్పు తనకు వ్యతిరేకంగా రావడంతో ఏకంగా జడ్జినే హతమార్చిన ఘటన ఇటీవల ఓ ఉత్తరాది రాష్ట్రంలో వెలుగు చూసిందనుకోండి.. అది వేరే విషయం. న్యాయస్థానాలు ఎంతలా ఈజీ టార్గెట్స్ అయిపోతున్నాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.

అసలు విషయానికొస్తే, వైసీపీ మద్దతుదారులైన ఆరుగురు వ్యక్తుల్ని తాజాగా సీబీఐ అదుపులోకి తీసుకుంది న్యాయమూర్తులపైనా, న్యాయస్థానాలపైనా జుగుప్సాకరమైన రీతిలో విమర్శలు చేసినందుకుగాను. గతంలో కూడా పలువుర్ని సీబీఐ ఇదే కేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే.

రాష్ట్ర పోలీసు యంత్రాంగం స్పందించాల్సిన రీతిలో స్పందించలేదన్న కారణంగా ఉన్నత న్యాయస్థానం, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా, అరెస్టయినవారిలో దాదాపు అందరూ వైసీపీ సానుభూతిపరులే. వారికి వైసీపీ తరఫున ఇలాంటి క్లిష్ట సమయంలో సరైన న్యాయ సహకారం లభించడంలేదన్న వాదనలున్నాయి.