ఎన్నికల వేళ కుల సంఘాలతో సమావేశాలు ఎందుకట.?

Caste Meetings regarding Tirupathi By Poll

Caste Meetings regarding Tirupathi By Poll

తిరుపతి ఉప ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ, ఆయా కుల సంఘాలతో ‘ఆత్మీయ సమ్మేళనాలు’ ఏర్పాటు చేస్తోంది. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంలో వైసీపీ కూడా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు చాలానే ఏర్పాటు చేసింది. నిజానికి, తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది.. ఈ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనాల వ్యవహారం. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సందర్భంగా కూడా ఇలాంటివి ఎక్కువగానే చూస్తుంటాం. అన్ని పార్టీల్లోనూ అన్ని కులాలకు సంబందించిన నాయకులుంటారు. ఫలానా పార్టీకి ఫలానా కులం అండగా వుంటుందని ఎవరైనా భావిస్తే అంతకన్నా హాస్యాస్పదం వుండదు. వైఎస్ జగన్ హయాంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకూ ప్రాముఖ్యత చాలానే వుంది.

చంద్రబాబు హయాంలోనూ ఇతర సామాజిక వర్గాలకూ ప్రాధాన్యత దక్కింది.. దక్కాలి కూడా. ఇది నిరంతర ప్రక్రియ. అయితే, తమ సామాజిక వర్గానికి అదిక ప్రాధాన్యత ఇచ్చుకోవాలని పాలకులు భావించడం కొత్తేమీ కాదు. చంద్రబాబు హయాంలో ఈ పైత్యం ఎక్కువగా కనిపించింది. అంతకు మించిన పైత్యం వైఎస్ జగన్ హయాంలోనూ కనిపిస్తోంది. రాజకీయాల్లో ఈ కుల పైత్యం తప్పదా.? అంటే, తప్పదేమో.. అన్న భావన అందరిలోనూ బలపడిపోయింది. ఈ క్రమంలోనే తిరుపతి ఉప ఎన్నిక వేళ కుల సంఘాల సమావేశాలు జరుగుతున్నాయి.. వాటి నిర్వహణ కోసం రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. ఎన్నికల వేళ ఆయా కుల సంఘాలు తమ డిమాండ్లను రాజకీయ పార్టీల ముందుంచడం, ఆయా కులాలకు చెందిన నాయకులు ఆర్థికంగా, రాజకీయంగా లాభపడటం మామూలే. ఆ తర్వాత ఆయా కులాల్ని ఎవరూ పట్టించుకోరనుకోండి.. అది వేరే సంగతి. పట్టించుకుంటే.. ఇంకోసారి ఎన్నికలొచ్చినప్పుడు కుల సంఘాల సమ్మేళనాల అవసరమే వుండదు కదా.!