ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. ఓటర్లను ఆకర్షించడమే వాళ్ల పని. దాని కోసం ఏదైనా చేస్తారు. ఓటర్ల కోసం ఎన్ని కుప్పిగంతులైనా వేస్తారు. ఎన్నికలు అయిపోయాక మళ్లీ ఓటర్ల మొహం కూడా చూడరు. అది కామనే కదా.
ఓటర్లను ఆకట్టుకోవడానికి ఓ అభ్యర్థి కూడా ఇదే పని చేశాడు. ఏకంగా గేదెపై ఊరేగుతూ వెళ్లి నామినేషన్ వేశాడు. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి కదా. దీంతో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి దర్భంగాలో నామినేషన్ వేయడానికి గేదె మీద ఊరేగుతూ వెళ్లాడు.
గేదెపై ఊరేగడమంటే గేదేను హించించడమేనని పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. జంతు సంరక్షణ చట్టం కింద, కరోనా వైరస్ జాగ్రత్తలను తీసుకోకుండా ఊరేగింపులో పాల్గొన్నందుకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అంతే కాదు.. ఎన్నికల ప్రచారం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతారా? మూగ జీవాలను హింసిస్తూ ఓటర్లనను ఆకర్షించాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోం.. అని నెటిజన్లు కూడా ఆ అభ్యర్థిపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన గేదె మీద ఊరేగుతూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బీహార్ లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నెలకొన్నది. బీహార్ లో మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28న మొదటి దశ, నవంబర్ 3, 7న రెండు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.