ఇవే నా చివరి ఎన్నికలు, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. మీకు ఎంతే సేవ చేశాను, నాకు మంచి ముగింపును ఇవ్వండి అంటూ బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో గంటలో ముగుస్తుందనగా పెద్ద మనిషి అనుకున్న నితీష్ కుమార్ ఈ రకంగా ఓటర్లకు వేడుకోవడం సంచలనం సృష్టించింది. జె.డి.యు పార్టీకి మరోసారి మద్దతు తెలిపి అధికారాన్ని కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి సరిగ్గా గంట ముందు ఇలా సెంటిమెంట్ తో కొట్టి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు సీఎం నితీష్ కుమార్.
ఎన్డీఏ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా నితీష్ కుమార్ బరిలో నిలిచారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ లాంతర్లు వెలిగించుకోవాల్సిన దుస్థితి వస్తుందని ఆరోపించారు. లాలూ సీఎంగా ఉన్నప్పుడు కొనసాగిన అరాచక రోజులను ఓసారి గుర్తు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీహార్ కు లా అండ్ ఆర్డర్ పరిచయం చేసింది తానేనని గుర్తు చేశారు. తాను రాజకీయాల్లో కొనసాగినా లేక రాజకీయాల్లోంచి నిష్క్రమించినా బీజేపీ, జేడీయూ భాగస్వామ్యం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పార్టీ వర్గాలతో కూడా చర్చించకుండా నేరుగా బహిరంగ సభలో సీఎం నితీష్ కుమార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం పార్టీలో గందరగోళానికి తెరలేపింది. ఆయన తప్పుకుంటే పార్టీ భవిష్యత్ ఏంటీ? నితీష్ లేకుంటే పార్టీ సవ్యంగా సాగుతుందా ? అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జె.డి.యు మిత్రపక్షమైన బీజేపీలోనూ నితీష్ రిటైర్మెంట్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
అయితే మొత్తం మీద సరిగ్గా ఓటింగ్ కు ముందు నితీష్ ఈరకంగా ప్రకటించడం ఎన్నికల స్టంట్ గానే భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి ఓటర్లు సానుభూతి చూపిస్తే జె.డి.యు పార్టీకి ఓట్ల పంట పండినట్టే.