సీఎంగా మళ్లీ నితీష్ కుమార్… అందులో అనుమానం అక్కర్లేదన్న బీజేపీ

బీహార్ కాబోయే ముఖ్యమంత్రి నితీష్ కూమార్ అని బీజేపీ తేల్చిచెప్పింది. జేడీ(యూ)కి బీజేపీ కంటే తక్కువ స్థానాలు వచ్చినా ఆయనే సీఎం అవుతారని తేల్చిచెప్పింది. నితీష్ స్థానంలో మరొకర్ని కూర్చోబెట్టే ప్రసక్తే లేదని బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ ఈమేరకు స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మొత్తం 125 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 74 స్థానాలను కైవసం చేసుకోగా, జేడీ(యూ) 43 సీట్ల మాత్రమే దక్కించుకుంది. దీంతో బీజేపీ అభ్యర్థే ఈసారి బీహార్ సీఎం అవుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ పుకార్లను తిప్పికొడుతూ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ స్పష్టతను ఇచ్చారు. ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెరగడం తగ్గడం సహజమని ఆయన అన్నారు. అయితే వీటితో సంబంధం లేకుండా రాష్ట్ర సర్కారులో ఇరు పార్టీలు సమాన భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయని చెప్పారు.

ఇది ఇలా ఉండగా… బీహార్ లో ఇప్పటి వరకు జేడీయూ నేత నితీష్ కుమార్ సొంతంగా ప్రభుత్వాన్ని స్ధాపించ లేదు. మరోవైపు బీజేపీకి కూడా అంత శక్తి లేకపోవడంతో ఇరు పార్టీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అయితే తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నితీశ్ సీఎంగా ఉన్నప్పటికీ కీలక శాఖలన్నీ బీజేపీ నేతలకే దక్కుతాయని టాక్.

ఇవే నా చివరి ఎన్నికలు, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. మీకు ఎంతో సేవ చేశాను, నాకు మంచి ముగింపును ఇవ్వండి అంటూ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు విజ్ఞప్తి చేసినా వారి నుంచి పెద్దగా స్పందన రాలైదు. ఓటర్లు జేడీయూకు అశించినన్ని సీట్లు కట్టబెట్టలేదు. దీంతో నితీష్ ఇమేజ్ గతంలో పోల్చితే చాలా దక్కిందని తెలుస్తోంది. మరోవైపు నితీశ్ స్థానాన్ని భర్తి చేసేంత సమర్ధత కలిగిన నాయకుడు బీజేపీ లేకపోవడంతో బీజేపీ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది.