వైజాగ్ స్టీల్‌పై కేంద్రాన్ని వైఎస్ జగన్ నిలదీయగలరా.?

దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి చిత్తూరు జిల్లా తిరుపతి వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కేంద్రాన్ని ప్రత్యేక హోదాపై అడుగుతామంటూ ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేసింది.

అయితే, ప్రత్యేక హోదా ఒక్కటే కాదు, చాలా అంశాలు ఈ సమావేశంలో చర్చకు రావాల్సి వుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వేదికగా జరుగుతున్న ఈ అరుదైన సమావేశాన్ని ఎంత మంచి వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకోగలుగుతారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

కేంద్ర హోం మంత్రికి స్వాగతం పలకడం దగ్గర్నుంచి, ఆయనతో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం వరకు.. అన్నీ పద్ధతిగానే నడుస్తున్నాయి. మరి, రాష్ట్ర సమస్యలపై కేంద్ర హోంమంత్రికి వైఎస్ జగన్ ఇవ్వబోయే ప్రెజెంటేషన్ ఎలా వుంటుంది.? దానికి కేంద్ర హోంమంత్రి సమాధానం ఎలా వుండబోతోందన్నదే అసలు చర్చ.

కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను కూడా ఆపేది లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ నామమాత్రపు సమావేశమే అవుతుంది తప్ప, దీనికి అదనపు ప్రత్యేకతలు ఆపాదించడం కూడా అనవసరం.

కానీ, రాష్ట్రం తరఫున రిప్రెజెంటేషన్ ఇవ్వాలి గనుక.. ఇస్తుందంతే. ముఖ్యమంత్రి తన పరిధిలో, కేంద్ర హోంమంత్రి ముందు రాష్ట్ర సమస్యల్ని పెడతారంతే. కానీ, విపక్షాలు మాత్రం ఈ సమావేశం నుంచి చాలా ఆశిస్తున్నాయి. అదే సమయంలో, అధికార వైసీపీ కూడా.. దీన్నొక అద్భుత వేదికగా, అత్యద్భుతమైన కలయికగా అభివర్ణిస్తుండడం గమనార్హం. అంచనాలు పెంచేసి, తుస్సుమనిపిస్తే.. అది రాజకీయంగా వైసీపీకి అంత మంచిది కాదు.