సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అతి త్వరలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతున్నారు. ప్రస్తుత సీజేఐ బాబ్డే పదవీ కాలం ఏప్రిల్ 23తో ముగియనుంది. తదుపరి చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్వీ రమణ పేరుని బాబ్డే ప్రతిపాదిస్తూ, కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. ఈ లేఖపై స్క్రూటినీ జరగనుంది. మామూలుగా అయితే, చీఫ్ జస్టిస్ ప్రతిపాదనకు అనుగుణంగానే తదుపరి చీఫ్ జస్టిస్ నియామకం జరుగుతుంటుంది. కాగా, జస్టిస్ ఎన్వీ రమణపై కొన్ని ఆరోపణలు చేస్తూ, చీఫ్ జస్టిస్ బాబ్డేకి గతంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అయితే, ఈ ఫిర్యాదు విషయమై అంతర్గత విచారణ జరిగిందా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. విచారణ జరిగిందనీ, జస్టిస్ ఎన్వీ రమణకు క్లీన్ చిట్ లభించడంతోనే, ఇప్పుడాయన పేరు న్యాయ శాఖకు చీఫ్ జస్టిస్ ద్వారా ప్రతిపాదించబడిందనీ ప్రచారం జరుగుతోంది. మరోపక్క, ప్రధాని నరేంద్ర మోడీతో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ ఎట్టి పరిస్థితుత్లోనూ చీఫ్ జస్టిస్ అవకుండా వైఎస్ జగన్ పావులు కదపగలరంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వైసీపీ అనుకూల మీడియాలోనూ ఇలాంటి కథనాలు దర్శనమిస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అంత సన్నిహిత సంబంధాలే వుంటే, మూడు రాజధానులకు ఆమోదం పొంది వుండేవారు. అంతే కాదు, శాసన మండలిని రద్దు చేయించగలిగి వుండేవారు. పైగా, న్యాయపరమైన అంశాల్లో జోక్యం అత్యంత ప్రమాదకరం గనుక, వైఎస్ జగన్ అంత రిస్క్ తీసుకుంటారని అనుకోలేం. వైసీపీ అనుకూల మీడియా కావొచ్చు, టీడీపీ అనుకూల మీడియా కావొచ్చు.. మితిమీరి చేసే విశ్లేషణలతో ఇటు జగన్ ప్రభుత్వానికీ అటు న్యాయ వ్యవస్థకీ మధ్య ‘గ్యాప్’ అనే ప్రచారం జనాల్లోకి వెళ్ళిపోతోంది.