విశాఖపట్నంలోని ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. కరోనా నేపథ్యంలో కార్మికులు, రాజకీయ పార్టీలూ ఈ నిరసనలకు కాస్త విరామం ఇచ్చాయి. మరోపక్క, ‘కుదిరితే అమ్మేస్తాం.. కుదరకపోతే మూసేస్తాం..’ అని ఇప్పటికే కేంద్రం, విశాఖ ఉక్కు పరిశ్రమపై స్పష్టతనిచ్చేసింది. ఈ తరుణంలో విశాఖ ఉక్కు ప్రైవైటీకరణ వద్దంటూ ఆంధ్రపదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయడం గమనార్హం. అసెంబ్లీలో జరిగే తీర్మానాలకు విలువెంత.? వాటిని కేంద్రం ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుంది.? అన్నదానిపై భిన్నాభిప్రాయాల్లేవ్.. ఒకటే అభిప్రాయం వుంది. కేంద్రం, ఇలాంటి తీర్మానాల్ని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన విషయంలో కావొచ్చు, ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం పట్టించుకోలేదు. అంతెందుకు, శాసన మండలి రద్దు దిశగా గతంలో ఆంధ్రపదేశ్ అసెంబ్లీ, అదీ వైఎస్ జగన్ హయాంలోనే తీర్మానం చేసి.. కేంద్రానికి పంపడం చూశాం. దానిపై కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయింది. సో, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కూడా కేంద్రం పట్టించుకునే అవకాశమే లేదన్నది నిర్వివాదాంశం. ‘విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవైటీకరించొద్దు.. సొంతంగా గనుల్ని కేటాయిస్తే లాభాలొస్తాయి.. స్టీలు ప్లాంటుకి చెందిన వినియోగంలో లేని భూముల్ని ప్లాట్లు వేసి విక్రయించడం ద్వారా ప్లాంటుకి నిధులు సమకూర్చవచ్చు..’ అంటూ రాస్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే రెండు సార్లు కేంద్రానికి లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. నిజానికి, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఒకే తాటిపైకొచ్చి కేంద్రంపై, రాజకీయంగా ఒత్తడి తేవడం వల్ల మాత్రమే కాస్తో కూస్తో ప్రయోజనం వుండొచ్చు తప్ప.. అలా కాని పక్షంలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గే అవకాశమే వుండదు.