వైసీపీ లో బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. పాతికేళ్ల వయసులోనే ప్రత్యర్థులుగా ఉన్న సీనియర్ లీడర్లను ఎదిరించి నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీని గెలిపించుకున్నాడనే పేరుంది బైరెడ్డికి. తన దూకుడు, వాక్చాతుర్యంతో యువతలో సైతం మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు సిద్దార్థ రెడ్డి. వైఎస్ జగన్ సైతం బైరెడ్డి అంటే ప్రత్యేక అభిమానం చూపుతుండేవారు. నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్నా కూడ పెత్తనం మొత్తం బైరెడ్డిదేనని అంటుంటారు పార్టీ నేతలు. బైరెడ్డి ఊపు చూసి పార్టీలో స్వల్ప కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఈమధ్య బైరెడ్డికి పార్టీలోని కొన్ని వర్గాలతో పొసగడం లేదట.
తమను మించిపోతున్నాడనే అసూయో, ఎవ్వరినీ లెక్కచేయడంలేదనే అక్కసో తెలీదు కానీ బైరెడ్డి అంటే పడనివారు ప్రత్యర్థి పార్టీ టీడీపీ నాయకులతో కలిసి బైరెడ్డిని తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక సిద్దార్థ రెడ్డికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఆయన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. సిద్దార్థ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి తన వారసుడిగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా సిద్దార్థ రెడ్డి వైసీపీలోకి మారడం, అనతికాలంలోనే జగన్ దృష్టిలో పడటం, నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించబడటం, అనంతరం వైసీపీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. దీంతో రాజశేఖర్ రెడ్డి వెనకబడిపోయారు. తాను తీసుకొచ్చిన వారసుడే తనకు పోటీ అయ్యాడనే భావన రాజశేఖర్ రెడ్డిలో ఉంది.
ఇప్పుడు సిద్దార్థ రెడ్డిని కిందకి లాగాలని అనుకునేవాళ్లంతా రాజశేఖర్ రెడ్డితో చేతులు కలిపారట. పథకం ప్రకారం సిద్దార్థ రెడ్డి గురించి వైఎస్ జగన్ వద్దకు బ్యాడ్ రిపోర్ట్స్ వెళ్ళేలా చేస్తున్నారని, ఈ కుట్రలతో జగన్, బైరెడ్డిల నడుమ దూరం పెరిగిందని టాక్. విషయాన్ని పసిగట్టిన సిద్దార్థ రెడ్డి ఎలాగైనా ముఖ్యమంత్రిని కలిసి మొత్తం వ్యవహారం వివరించి కుట్రలను భగ్నం చేయాలని, పాత వాతావరణం సృష్టించుకోవాలని జగన్ అపాయింట్‌మెంట్ గట్టిగా ట్రై చేస్తున్నారు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలకే దొరకని సీఎం సిద్దార్థ రెడ్డికి కలవడానికి అనుమతి ఇస్తారేమో చూడాలి.