వైఎస్ జగన్ అంత సులభంగా ఎవ్వరికీ కనెక్ట్ అవ్వరు. ఒకవేళ అయితే అంత ఈజీగా వదిలిపెట్టరు. తన వాళ్ళు అనుకున్న వ్యక్తుల మీద ఆయన చాలానే నమ్మకం పెట్టేసుకుంటారు. అలాంటప్పుడు ఆ వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారశైలిలో ఎలాంటి తేడాలు రాకుండా చూసుకోవాలి. లీడర్ అభిమతానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఒకవేళ తేడాలే వస్తే సీన్ వేరేలా ఉంటుంది. జగన్ అస్సలు ఊరుకోరు. అలాంటి పొరపాటే నందికొట్కూరు నియోజకవర్గంలో జరిగిందని అంటున్నారు. అక్కడ నియోజకవర్గ ఇన్ ఛ్జార్జ్ బాధ్యతలను బైరెడ్డి సిద్దార్థ రెడ్డి చూస్తున్నారు. గత ఎన్నికల్లో అక్కడ పార్టీని గెలిపించడంలో సిద్దార్థ రెడ్డి కీలక భూమిక పోషించారు. అన్నీ తానై పార్టీని నడిపారు. వ్యతిరేక శక్తులను ధీటుగా ఎదుర్కొన్నారు.
అందుకే సిద్దార్థ రెడ్డి అంటే జగన్‌కి చాలా అభిమానం. అక్కడ ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్నా కూడ ఇన్ ఛార్జ్ బాధ్యతలను సిద్దార్థ రెడ్డికి అప్పగించారు. ఇలా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒకరు, ఇన్ ఛార్జ్ మరొకరు ఉండటం చాలా అరుదు. కానీ సిద్దార్థ రెడ్డి విషయంలో అది జరిగింది. ఎన్నికలు ముగిశాక కూడ నియోజకవర్గంలో సిద్దార్థ రెడ్డి హవానే కొనసాగింది. ఎమ్మెల్యే ఉన్నా అంతా సిద్దార్థ రెడ్డే నడిపేవారు. స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పమపక్కమ కూడ సిద్దార్థ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని అంటారు. ఇలా ఎమ్మెల్యేను డమ్మీని చేసి రాజకీయం మొత్తం సిద్దార్థ రెడ్డే నడుపుతున్నా జగన్ కలుగజేసుకోలేదు. కానీ నామినేటెస్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల ఎంపికలో సైతం సిద్దార్థ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం జగన్‌కి నచ్చలేదట.
నామినేటెడ్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల జాబితా తయారుచేయమని జగన్ కొందరు సీనియర్ లీడర్లకు చెప్పడం, వారు జగన్ పెట్టిన షరతులను మీరడంతో ఆగ్రహానికి గురైన సంగతి గురించి నిన్ననే మాట్లాడుకున్నాం. అలా జరిగిన నియోజకవర్గాల్లో నందికొట్కూరు కూడ ఒకటి. ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ పోస్టుల భర్తీకి జరిగిన ఎంపిక అంతా ఒక సామాజికవర్గానికి మాత్రమే అనుకూలంగా జరిగిందని, తమ ఎస్సీ వర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, అసలు ఎంపికలో తమ అభిప్రాయాలకు చోటే లేకుండాపోయిందని ఎమ్మెల్యే ఆర్థర్ జగన్ వద్ద మొరపెట్టుకున్నారని, విషయం తెలిసిన జగన్ తనకు తెలియకుండా తన మాటను మీరి వ్యవహరించినందుకు సిద్దార్థ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి. జగన్ అంటే ప్రాణం పెట్టే సిద్దార్థ రెడ్డి ఇలా చేశారంటే నమ్మడం కష్టమే. ఆయన వర్గం సైతం ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యేకు, సిద్దార్థకు ఎలాంటి పొరపచ్చాలు లేవని, సిద్దార్థ రెడ్డి ఎల్లప్పుడూ జగన్‌కి విధేయుడేనని అంటున్నారు.