BWF World Championships Finals: ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన కిదాంబి శ్రీకాంత్.. ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్లోఓటమి

BWF World Championships Finals: భారత బ్యాడ్మింటన్ హీరో కిదాంబి శ్రీకాంత్ కు అడుగు దూరంలో విజయం చేజారిపోయింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ను తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అదృష్టం కలిసిరాలేక శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. సింగపూర్ ప్లేయర్ కిన్ యూ చేతిలో 21-15, 22-20 తేడాతో పోరాడి విఫలమయ్యాడు. దీంతో రజిత పతకానికే పరిమితం అయ్యాడు. ఇంకో ఆటగాడు లక్ష్యసేన్ కాంస్య పతకం అందుకున్నాడు. భారత్ తరుపున ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఒకేసారి ఇద్దరు ఆటగాళ్ళకు పతకాలు రావడం విశేషం.

గతంలో సింగపూర్ ప్లేయర్ లో కిన్ యూను వరుస గేముల్లో ఓడించిన అనుభవం కిదాంబికి ఉంది. అంతేకాక 2018 కామన్వెల్త్ పోటీల్లో జరిగిన వరుస గేముల్లో అతడికి పరాజయం రుచి చూపించాడు. అప్పటికీ, ఇప్పటికీ అతడి ఆటలో ఎంతో మార్పు వచ్చింది. ఇదే ఈవెంట్లో ఒలంపిక్ విజేత, ప్రపంచ చాంప్ నంబర్ విక్టర్ అక్సెల్ సెన్ ను ఓడించాడు. దీంతో కిన్ యూ, కిదాంబి పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

తొలిగేమ్ ను ఎంతో ఘనంగా, దూకుడిగా ఆరంభించాడు శ్రీకాంత్. తర్వాత కిన్ పుంజుకి ఆట స్వరూపాన్నే మార్చేశాడు. మళ్లి ఆట పుంజుకున్న శ్రీకాంత్ స్కోరుని 11-11 కి సమం చేసాడు. కిన్ తెలివిని ప్రదర్శిస్తూ, బలమైన స్మాష్ లు బాదాడు. 21-15 తో గేమ్ ను సొంతం చేసుకుని 1-0 ఆధిక్యంలో నిలిచాడు కిన్.

ఆ తర్వాత రెండో గేమ్ మాత్రం హోరా హోరీగా సాగింది. ఆట నిలవాలంటే తప్పక గెలవాల్సిన రౌండ్ ని శ్రీకాంత్ తెలివిగా మొదలు పెట్టాడు. మ్యాచ్ మధ్యలో తీవ్ర ఒత్తిడికి గురైన శ్రీకాంత్ అనవసర తప్పిదాలు చేసాడు. దాంతో 22-20తో కిన్.. గేమ్ ను, మ్యాచ్ ని శ్రీకాంత్ చేతినుండి ఎగరేసుకుపోయి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నాడు.