Vijayasai Reddy In : మంత్రి పదవి పెద్దదా.? రాజ్యసభ సభ్యత్వం ప్లస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి పెద్దదా.? సరే, ఆ లెక్కల సంగతి పక్కన పెడితే, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇటీవల ప్రమోషన్ లభించింది. పార్టీకి సంబంధించి అన్ని విభాగాలకూ ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇటీవలే ఆయన అందుకున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు కావడమే అందుక్కారణం.
జాతీయ స్థాయిలో పార్టీకి సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించి అన్ని వ్యవహారాల్నీ విజయసాయిరెడ్డి చక్కబెట్టేస్తుంటారనీ, ఆయనకు మాత్రమే ఆ ప్రత్యేక వెసులుబాట్లు వైసీపీలో వున్నాయనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
మరి, అలాంటి విజయసాయిరెడ్డిని రాష్ట్ర స్థాయికి పరిమితం చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అనుకుంటారు.? కానీ, విజయసాయిరెడ్డిని ఆర్థిక మంత్రిగా చేయాలని జగన్ భావిస్తున్నారంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది. ఇందులో నిజమెంతుందోగానీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పని తీరు అయితే అస్సలు బాగాలేదనీ, విపక్షాలకు ధీటైన సమాధానం ఇవ్వడంలో బుగ్గన ఫెయిలవుతున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లో గట్టిగా జరుగుతోంది. ఆ కారణంగానే బుగ్గన మంత్రి పదవిని కోల్పోయే అవకాశం వుందట.
ఆర్థిక వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి దిట్ట. విపక్షాలను తనదైన మాటల తూటాలతో ఇరుకున పెట్టడంలో కూడా విజయసాయిరెడ్డి తనకు తానే సాటి. సో, ఎలా చూసినా ఆర్థిక మంత్రిగా విజయసాయిరెడ్డికి అవకాశం దొరికితే.. వైసీపీకి రాజకీయంగా అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుందన్నది నిర్వివాదాంశం.