టీడీపీ నేతల మధ్య విభేదాలు రోజురోజుకి ముదురుతున్నాయి. తాజాగా కేశినేని నాని వ్యతిరేక వర్గం సమావేశం అయ్యింది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా నివాసంలో సమావేశమైన నేతలు…ఎంపీ నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్గంలో కీలక నేత అయిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా ఎంపీ కేశినేని నానితో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చామన్నారు. తమకెంతో బాధగా ఉందన్నారు.
చంద్రబాబును ఏక వచనంతో సంబోధించడం, చిటికెలు వేసి విజయవాడకు తానే అధిష్టానం అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. కేశినేని నానిని ఆరోజే చెప్పుతో కొట్టేవాడిని.. చంద్రబాబు మీద గౌరవంతో వదిలేశానన్నారు. ‘‘నీ స్థాయి దాటి వ్యవహరిస్తున్నావు.. దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం. రంగా హత్య కేసులో ముద్దాయిని ఎన్నికల ప్రచారంలో తిప్పుతున్నాడు. టీడీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేశినేని నాని తీరుపై టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ టీడీపీకి తానే అధిష్ఠానమని కేశినేని వ్యాఖ్యలు చేసి తన తీరును బయటపెట్టారని చెప్పారు. తన కూతురుని మేయర్ చేయడం కోసమే ఆయన ఇటువంటి తీరును కనబర్చుతున్నారంటూ ధ్వజమెత్తారు.తమ పార్టీ అధినేత చంద్రబాబుకు కేశినేని కావాలో.. తామందరం కావాలో తేల్చుకోవాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. చంద్రబాబుకు కేశినేని నాని ముఖ్యం అనుకుంటే, తాము రేపు జరుగబోయే చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉంటామని ఆయన చెప్పారు. కేశినేని నాని కులాల మధ్య, పార్టీ నేతల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీలో ఉన్నందుకే కేశినేని నాని గెలిచారని, ఆయనకు విజయవాడలో అంతగా సత్తా ఉంటే రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చూపించాలని బోండా ఉమ సవాలు విసిరారు.