వైఎస్ జగన్ సాయం లేకుండా బీఆర్ఎస్ పార్టీనా.?

YSRCP

2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళిన విషయం విదితమే. ఫెడరల్ ఫ్రంట్ విషయమై ప్రాథమికంగా అప్పట్లో కేటీయార్, వైఎస్ జగన్‌తో చర్చలు జరిపారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, ప్రగతి భవన్ కేంద్రంగా ఇరు రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాల దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారుల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఒకటి రాజకీయ చర్చ, ఇంకోటేమో ప్రభుత్వాల పరంగా చర్చ. రెండిటి మధ్యా చెప్పుకోవడానికి ఓ చిన్న తేడా వుందిగానీ, నిజానికి.. రెండూ ఒకటే.! రెండిట్లోనూ నడిచేది రాజకీయమే.

ఆ తర్వాత వైఎస్ జగన్ సర్కారు మీద తెలంగాణ రాష్ట్ర సమితి విమర్శల పర్వాన్ని మనం చూస్తూనే వున్నాం. ప్రభుత్వాల మధ్య కూడా గడబిడ నీటి వాటాల విషయమై, విద్యుత్ ఉత్పత్తి, బకాయిలు తదితర అంశాలపై జరగడం కూడా కనిపిస్తూనే వుంది.

నిజానికి, దేశ రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయం తనదైన ముద్ర గతంలోనే వేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో బలమైన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి అంతకు ముందు ఎన్టీయార్, చంద్రబాబు.. దేశ రాజకీయాలపై తమదైన ముద్ర వేశారు.

అదంతా గతం. ఇప్పుడు కేసీయార్, జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే, ముందుగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీతో గతంలో చేసిన ప్రాథమిక చర్చలకు కొనసాగింపు వుండాలి. లోక్ సభ సీట్ల పరంగా చూసుకుంటే, తెలంగాణ కంటే ఏపీ పెద్ద రాష్ట్రం. ఆ లెక్కన, జాతీయ రాజకీయాల గురించి కేసీయార్ ఆలోచన చేసే ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయంపై ఆయనకు ఓ ఖచ్చితమైన ఆలోచన వుండాలి.

కానీ, ఆ పరిస్థితే కనిపించడంలేదు. అనవసరంగా ఏపీని కెలికేశారు పోలవరం సహా పలు అంశాలకు సంబంధించి. ఇప్పుడేమో విజయవాడలో సంక్రాంతి సమయంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందని అంటున్నారు. అసలు ఆ పార్టీకి అంత సీన్ అక్కడ ఇస్తారా.? హోర్డింగులు పెట్టినంత తేలికా.? అక్కడ పోటీ చేసి గెలవడం.?