వలస కూలీల వ్యధలు ఆ దేవుడికే ఎరుక. మండుటెండలో నెత్తిన బరువులేసుకుని వందల కిలోమీటర్లన నడుచుకొస్తున్న వారిపై ఎంత కఠినాత్ముడికైనా వాళ్ల పడుతోన్న బాధలను చూస్తే చలించిపోతాం. అయ్యో పాపం అంటాం. కానీ గుంటూరు జిల్లా తాడేపల్లిలో అలాంటి వలస కూలీలపైనే పోలీసులు లాఠీలు ఝుళిపించారు. లాఠీలు విరిగేలా విరుచుకుపడ్డారు. పోలీసుల దాడితో కూలీలంతా దొరికిన చోటికి లగెత్తారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఘండ్, శ్రీకాకుళం, విజనగరంకు చెందిన కూలీలు నిన్న సాయంత్రం రోడ్డుపై నడుచుకుంటూ స్వస్థలాలకు బయలు దేరారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తోన్న ఏపీ సీఎస్ నీలం సాహ్ని వారిని చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారందర్నీ ముందుగా పునరావస కేంద్రాలకు తరలించి తర్వాత స్వస్థలాలకు తరలించాలని ఆదేశాంచారు. ఆదేశాల మేరకు అధికారులు కూలీలు అందర్నీ విజయవాడ క్లబ్ కు తరలించారు. ఉదయం వారందరికీ అల్పాహారం పంపిణీ చేశారు. ఈ క్రమంలో సైకిళ్లపై వచ్చిన దాదాపు 150 మంది కూలీలు టిఫిన్ చేసి తిరుగు ప్రయాణం పట్టారు. వీరంతా విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు చూసి అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు.
దీంతో కూలీలు పరుగు తీసారు. చేతిలో ఉన్న బరువులను వదిలేసి వెనకా ముందు చూడకుండా పరుగులు అందుకున్నారు. ఆ సమయంలో పోలీసులు సైతం మరింత రెచ్చిపోయారు. కనికరం లేకుండా లాఠీలకు పని చెప్పారు. దీంతో కూలీలు పోలీసుల తీరుపై ఆగ్రహం చెందుతున్నారు.ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేయదు? మా తిప్పలేవో పడుతుంటే వాటిని అడ్డుకుంటున్నారు? తిండి..వసతి లాంటి సౌకర్యాలైనా ఏర్పాటు చేస్తే ఏదో ఒక మూల ఉంటామని, అదీ చేయక, తమ దారి తమని చూసుకోనీయక చేస్తే ఎలా? అంటూ ఆగ్రహం చెందారు.