విజయనగరంలో రాజ్యాలు పోయినాకానీ రాజులు మాత్రం ఉన్నారు. అక్కడి ప్రజల చేత ఇప్పటికి గౌరవ వందనాలు పొందుతున్నారు. పూసపాటి రాజులు అంటే ఇప్పటికి అక్కడ మంచి పేరు ఉంది. అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్నా కొన్ని సంఘటనలు వలన ఆ రాజ కుటుంబ విలువ బజారున పడుతుంది. ముఖ్యంగా మాన్సాస్ ట్రస్ట్ విషయంలో పెద్దాయన పూసపాటి అశోక్ గజపతి రాజుకు ఆయన అన్న కూతురు పూసపాటి సంచయిత కు మధ్య గత కొద్దీ నెలలుగా యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడు అది తీవ్ర స్థాయికి చేరుకుంది.
తన నుండి అధికారం తీసుకున్న సంచయిత మీద అశోక్ గజపతి రాజు కోర్టు లో కేసులు వేశాడు, కానీ ఇప్పుడు అశోక్ గజపతిరాజు మెల్లగా వీధి పోరాటాల్లోకి దిగిపోయారు. ఇంతకాలం న్యాయ స్థానాల తీర్పుల కోసం ఎదురుచూసిన పెద్దయాన ఇపుడు మాత్రం ప్రత్యక్ష పోరాటాలకు రెడీ అయ్యారంటే రాజకీయం రక్తి కడుతోందనే భావించాలి. యాభై వేల కోట్ల మాన్సాస్ ట్రస్ట్ భూములను సంచయిత గజపతిరాజు తాకట్టు పెడుతోందని అశోక్ గట్టిగానే ఆరోపణలు చేసారు.
దానికి ప్రతిగా బాబాయ్ మీద అమ్మాయి కూడా అదే స్థాయిలో రివర్స్ కౌంటర్లు వేశారు. అసలు 30 కోట్ల రూపాయల నిధులను నాటి టీడీపీ సర్కార్ నుంచి మాన్సాస్ కి బాకీ ఉంటే ఎందుకు సాధించలేకపోయారని సంచయిత అశోక్ ని నిలదీశారు. కారు చవకగా మాన్సాస్ భూములకు తన అనుచరులకు లీజుకి ఇచ్చినపుడు సేవ్ మాన్సస్ ఉద్యమం ఏమైంది అని ఆమె ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి సరైన అనుమతులు తెచ్చుకోకుండా చేయడం చేత 170 మంది మాన్సాస్ కాలేజీ విద్యార్ధులకు డిగ్రీ సర్టిఫికేట్లు చెల్లుబాటు కాకుండా పోయాయని ఆమె అశోక్ మీద విరుచుకుపడ్డారు.
ఇక కోర్టు కేసుల ద్వారా 13 కోట్ల విలువ అయిన మాన్సాస్ భూములు పోతే నాటి చైర్మన్ హోదాలో అశోక్ ఏం చేశారని కూడా ఆమె ప్రశ్నించారు. విజయనగరం ఎమ్మార్ కళాశాలకు ఎయిడెడ్ హోదా పోయింది కూడా అశోక్ టైం లోనేనని అసలు గుట్టు విప్పారు. దీనితో ఇప్పుడు ఈ వివాదం కేవలం విజయనగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిపోయింది. మొత్తానికి తన కోసం మాత్రమే సేవ్ మాన్సాస్ ఉద్యమాన్ని అశోక్ నడిపిస్తున్నారంటూ అమ్మాయ్ గట్టిగానే బాణాలు వేస్తున్నారు. ఇన్నాళ్ళూ మాటలకే పరిమితం అయిన మాన్సాస్ పోరాటం ఇపుడు వీధుల దాకా వచ్చింది. రాబోయే రోజులో ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుదో చూడాలి.