యువ‌తిపై క‌త్తితో ప్రేమోన్మాది దాడి , అసలు సంగతేంటి ?

తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి తనను మోసం చెేసిందని, వేరొకరితో పెళ్లికి సిద్ధమైందన్న కోపంతో ఓ యువతిపై యువకుడు దాడిచేశాడు. ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచాడు. గుండిపేట మండలం హైదర్షాకోట్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

యువ‌తిపై క‌త్తితో ప్రేమోన్మాది దాడి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదర్షాకోట్‌కు చెందిన ఓ యువతి హైదరాబాద్‌ లో సాప్ట్‌ వేర్ ఇంజినీర్ ‌గా పనిచేస్తోంది. ఆమెకు ఓ ఇంటర్నేషనల్ సెలూన్‌ లో పనిచేసే షారూఖ్ సల్మాన్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అతడి స్వస్థలం హర్యానా. కొన్నేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. తరచూ కలుసుకునేవారు. సల్మాన్ అప్పుడప్పుడూ హైదర్షాకోట్‌ లో ఉన్న యువతి ఇంటికి కూడా వచ్చేవాడు.

కానీ ఏమైందో ఏమో గానీ..ఆ యువతి కొన్ని రోజులుగా సల్మాన్‌ ను దూరం పెడుతూ వస్తోంది. అంతేకాదు వేరొక వ్యక్తితో పెళ్లికి సిద్ధమయింది. ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది. మేలో పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా ఖరారయింది. ఈ విషయం తెలుసుకున్న షారుఖ్ సల్మాన్.. ఆమెపై ఆగ్రహంతో రగిలిపోయాడు. తనను ప్రేమించి.. వేరకొకరిని పెళ్లి చేసుకుంటుందా? అని పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి. 07.30 గంటల సమయంలో యువతి ప్లాట్‌ కు వెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. దుండగుడి దాడిలో గాయపడిన యువతిని లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె వీపు భాగంలో రెండు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె శరీరంపై మరో రెండు చిన్న గాయాలు కూడా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె కోలుకుంటోందని తెలిపారు.